ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్ట్రైక్ రేట్ చూసి ఆటగాళ్లను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టీకరణ

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 07:05 PM

ఆసియా కప్ 2025 సమీపిస్తున్న తరుణంలో భారత జట్టు కూర్పుపై చర్చలు ఊపందుకున్నాయి. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో టీ20 జట్టు నిండిపోయిన వేళ, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, గిల్‌కు గట్టిగా మద్దతు పలికాడు. గిల్ ను తక్కువ అంచనా వేయొద్దని, టీ20 ఫార్మాట్‌లో ఆధిపత్యం చెలాయించే సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు.జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హర్భజన్ మాట్లాడుతూ, టీ20 క్రికెట్ అంటే కేవలం భారీ షాట్లు కొట్టడమే కాదని స్పష్టం చేశారు. "ఎవరికైతే బలమైన పునాది ఉంటుందో, వారు ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగలరు. శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని ఆపడం కష్టం. ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లో పరుగులు సాధించాడు, ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. అతడు కేవలం 120-130 స్ట్రైక్ రేట్‌తోనే కాదు, అవసరమైతే 160 స్ట్రైక్ రేట్‌తో కూడా ఆడగలడు" అని వివరించాడు.ప్రస్తుతం గిల్ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 139.27 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నప్పటికీ, ఆ గణాంకాలను చూసి అతడిని తక్కువ చేయకూడదని భజ్జీ సూచించారు. జట్టులో ఎంత పోటీ ఉన్నా, గిల్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలడని ఆయన పేర్కొన్నారు.భారత క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైందని హర్భజన్ వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా భారత జట్టు ఆడబోయే మొదటి పెద్ద టోర్నమెంట్ ఇదేనని గుర్తుచేశాడు. "క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు. గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ వంటి వారి తర్వాత కూడా ఆట ముందుకు సాగింది. ఇప్పుడు రోహిత్, విరాట్ తమ వారసత్వాన్ని సురక్షితమైన చేతుల్లో పెట్టారు. ఇంగ్లండ్‌లో యువ జట్టు ఆడిన తీరు చూస్తే అది అర్థమవుతుంది. ఈ కుర్రాళ్లు బాధ్యత తీసుకుంటున్నారు" అని హర్భజన్ అన్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa