ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 07:45 PM

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటుచేసిన టాటా హిటాచీ డీలర్ షిప్ షోరూం, మెషిన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ"ఇక్కడకు వస్తుంటే రోడ్డుపైన ఒక ఎక్స్‌కవేటర్ పెట్టారు. అది చూసినప్పుడు నాకు 2019-24 మధ్య రోజులు గుర్తుకు వచ్చాయి. గత ప్రభుత్వంలో శుక్ర, శనివారాలు వస్తే ఈ బుల్డోజర్‌ను ఎవరో ఒకరి ఇంటికి పంపేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజా ప్రభుత్వంలో మాత్రం ఎక్స్‌కవేటర్స్‌ను అభివృద్ధి కోసం, అమరావతి పనులు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తోంది. మంగళగిరి అమరావతికి ముఖద్వారం. అమరావతిలో పనులు చేసేవారు మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉంది. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరికి వచ్చాను. మీ సమస్యలను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేనేంటో మీకు తెలియదు. 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఐదేళ్లపాటు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తెలుసుకున్నాను. ప్రభుత్వం కంటే మెరుగైన సేవా కార్యక్రమాలను ఆనాడు నేను చేశాను" అని లోకేశ్ అన్నారు.2024 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయవద్దని తనను చాలామంది కోరారని, అయినా ఇక్కడి నుంచే పోటీచేసి గెలుస్తానని చెప్పానని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆనాడు కోరానని, తనను ఏకంగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారని అన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సహచర మంత్రులు.. ఇలా ఎవరైనా మంగళగిరి కోసం పని అంటే కాదని చెప్పేవారు లేరని అన్నారు.ఇంటి పట్టాలు, వంద పడకల ఆసుపత్రి, స్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మంగళగిరిలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. బుల్డోజర్‌ను మంచి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని అన్నారు. జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా ముందు మంగళగిరికే ప్రాధాన్యత ఇస్తానని, గూగుల్ ఎంత ముఖ్యమో ఈ డీలర్ షిప్ కూడా తనకు అంతే ముఖ్యమని అన్నారు."డీలర్‌షిప్ వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రతి ఉద్యోగం ఎంతో ముఖ్యం. గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు. వారు భవన నిర్మాణాలు చేయాలంటే ఎకో సిస్టమ్ కావాలి. ఇదే ఎక్స్‌కవేటర్, బుల్డోజర్ కూడా అవసరం. దానికి సర్వీస్ సెంటర్ కావాలి. చంద్రబాబుని చూసే నేను ఇది నేర్చుకున్నాను. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. డీలర్‌షిప్‌ల వల్ల కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మొత్తం ఎకోసిస్టమ్ వస్తే మేం ఇవన్నీ సాధించగలగుతాం. ఇతర డీలర్‌షిప్‌లను కూడా మంగళగిరి ఏర్పాటు చేస్తే మా యువతకు ఉద్యోగాలు వస్తాయని కంభంపాటి గారిని కోరుతున్నాను. లక్ష్మీ గ్రూప్‌ను చూస్తూ పెరిగాను. ఎంతో నిబద్ధత గల సంస్థ. టీడీపీ ఎంతోమంది ఎదుగుదలకు తోడ్పడింది. కంభంపాటి గారు దాదాపు 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. సంస్థ మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ అన్నారు.మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని, దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తామని లోకేశ్ అన్నారు. వచ్చే నెలలో భూగర్భ డ్రైనేజీ పనులు కూడా ప్రారంభిస్తామని అన్నారు. టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ మద్దతు ఏపీకి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కంపెనీలు ఏపీకి రావడం వెనుక అనేక మంది కృషి ఉందని, అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే మా లక్ష్యమని లోకేశ్ చెప్పారు.అనంతరం ఎక్స్‌కవేటర్లను కొనుగోలు చేసిన పలువురు కస్టమర్లకు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గ్రూప్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ కంభంపాటి రామ్మోహన్ రావు, టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్, లక్ష్మీ గ్రూప్ ఎండీ కె. జయరాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. భరత్ భూషణ్, ఆపరేషనల్ డైరెక్టర్ కె. వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa