ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.220 కోట్ల ఆఫర్ వదులుకున్న పోలీస్ చీఫ్.. ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీతో చేతులు కలపడానికి నాట్ రెడీ

international |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 10:05 PM

సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖ అయినా ఫెడరల్ గ్రాంట్‌లను, కోట్ల రూపాయల ఆఫర్లను కళ్లకద్దుకొని తీసుకుంటుంది. కానీ, అమెరికాలోని కీలక రాష్ట్రమైన టెక్సాస్‌లో ఉన్న డల్లాస్ నగరంలో మాత్రం ఒక ఆశ్చర్యకర ఘటన జరిగింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ స్వయంగా డల్లాస్ పోలీసులకు 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 220 కోట్లు) గ్రాంట్‌గా ఇస్తామని భారీ ఆఫర్ చేసింది. కానీ, పోలీస్ చీఫ్ డానియల్ కొమౌక్స్ ఏ మాత్రం ఆలోచించకుండా, ‘అస్సలు కుదరదు, అవసరం లేదు’ అంటూ ఆ ఆఫర్‌ను గట్టిగా తిరస్కరించారు. ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అమెరికా రాజకీయాలు, వలసదారుల వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది.


భారీ మొత్తాన్ని ఎందుకు ఆఫర్ చేసింది?


అమెరికా 287 (g) ప్రోగ్రామ్‌లో డల్లాస్‌ను భాగం చేయడానికి ఐసీఈ ఈ మొత్తం ఆఫర్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్థానిక పోలీసు అధికారులకు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేసే అధికారం లభిస్తుంది. అంటే, డల్లాస్ పోలీసులు తమ రెగ్యులర్ విధులతో పాటు, ICE ఏజెంట్లలాగా మారి ఇమ్మిగ్రేషన్ దాడుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా, అనధికార వలసదారులను అరెస్ట్ చేయడం లేదా వారి వీసా స్టేటస్‌ను తనిఖీ చేయడం వంటి పనులు చేయాలి. ఈ ఫెడరల్ బాధ్యతలను తీసుకున్నందుకు బదులుగానే ఆ 25 మిలియన్ డాలర్ల భారీ మొత్తం డల్లాస్ నగరానికి ఆఫర్‌గా వచ్చింది.


  డల్లాస్ కమ్యూనిటీ పోలీస్ ఓవర్‌సైట్ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చీఫ్ కొమౌక్స్ స్వయంగా వెల్లడించారు. ‘ఫెడరల్ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించింది. 287(g)లో చేరడానికి 25 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆఫర్ చేసింది. నేను దానికి 'కుదరదు' అని చెప్పాను. అది నా నిర్ణయం’ అని ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారు. తమ అధికారులు ఎవరూ ఐసీఈ ఏజెంట్లతో కలిసి ఇమ్మిగ్రేషన్ అరెస్టులకు వెళ్లరని, తమకు ఆ అధికారం లేదని, అలా చేయబోమని ఆయన పదేపదే చెప్పారు. డల్లాస్ పోలీసుల ప్రధాన విధి స్థానిక శాంతిభద్రతలను కాపాడటం మాత్రమే, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం కాదని కొమౌక్స్ గట్టిగా నొక్కి చెప్పారు.


కొమౌక్స్ ఎందుకు నో చెప్పారు?


చీఫ్ కొమౌక్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కమ్యూనిటీ నమ్మకాన్ని కాపాడటమే. పోలీసులకు ఇమ్మిగ్రేషన్ పవర్స్ ఇస్తే, వలసదారుల వర్గాలలో భయాందోళనలు పెరుగుతాయి. నేరం జరిగినా, ప్రమాదం జరిగినా పోలీసులకు ఫోన్ చేయడానికి వలసదారులు భయపడతారు. ఇది మొత్తం నగర భద్రతకు, దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందుకే, తమ పరిధిలోని పౌరులంతా, వారి స్టేటస్ ఏదైనా సరే... నిస్సంకోచంగా పోలీసుల సహాయం తీసుకోవాలనే 'ట్రస్ట్' విధానాన్ని కొనసాగించాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


అయితే, కొమౌక్స్ ఐసీఈతో అన్ని రకాల సహకారాన్ని పూర్తిగా నిరాకరించినట్లు కాదు. తీవ్రమైన నేరాలకు అంటే మానవ అక్రమరవాణాకు సంబంధించిన దర్యాప్తులలో ICE సహాయం అడిగితే, తమ లైసెన్స్ ప్లేట్ కెమెరా నెట్‌వర్క్ వంటి టెక్నాలజీ ద్వారా సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఇమ్మిగ్రేషన్ అరెస్టుల విషయంలో మాత్రం తాము పాల్గొనబోమని స్పష్టంగా చెప్పారు. టెక్సాస్ వంటి సంప్రదాయవాద రాష్ట్రంలో ఒక లోకల్ పోలీస్ చీఫ్, కోట్ల రూపాయల ఆఫర్‌ను వదులుకొని, సామాజిక బాధ్యతకు, కమ్యూనిటీ నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రశంసలు అందుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa