విజయవంతంగా 18 సీజన్లు పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు మెగా వేలం జరగ్గా.. ఈసారి 2026 ఐపీఎల్ కోసం మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. అయితే అంతకుముందు అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (రిటెన్షన్ లిస్ట్) ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం నవంబర్ 15 డెడ్‌లైన్ అని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ రిటెన్షన్ గడువుకు ముందు ఇంటర్నల్‌గా ఆయా ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో రహస్యంగా చర్చలు జరుపుతున్నాయి. దీనినే ట్రేడ్ డీల్ అనొచ్చు. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తమ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా సహా సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను దక్కించుకోవడం దాదాపు ఖాయమైందనే తెలుస్తోంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.
అయితే ఈ క్రమంలోనే రవీంద్ర జడేజాకు సంబంధించిన ఒక పాత వివాదం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అదే జడేజాపై ఐపీఎల్ నిషేధం విధించడం. అవును.. జడ్డూ 2010 ఐపీఎల్ సీజన్ ఆడలేదు. వివాదాస్పద వైఖరితో ఆ సీజన్.. జడేజాపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడాది పాటు నిషేధం విధించింది. దీని గురించి చాలా మందికి తెలిసుండదు. తెలిసినా ఇప్పుడు అది గుర్తుండి ఉండకపోవచ్చు. అసలు అప్పుడేమైందంటే..
రవీంద్ర జడేజా ఐపీఎల్ తొలి రెండు సీజన్లు (2008, 09).. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే తర్వాతి సీజన్ కోసం.. తన సొంత ఫ్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్‌కు తెలియకుండానే.. మెరుగైన కాంట్రాక్ట్ కోసం వేరే జట్టుతో (రిపోర్ట్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ ) రహస్యంగా ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పుడు ఫైనల్ స్క్వాడ్ గడువు ముగిసిన తర్వాత చూస్తే.. జడేజా కాంట్రాక్ట్‌లో లేడు. ఈ వ్యవహారంపై అప్పటి ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ స్పందించాడు.
ఆ సమయంలో జడేజా భారత్ తరఫున కేవలం 19 వన్డేలు, 5 టీ-20లు మాత్రమే ఆడాడు. అప్పుడు జడేజా ఐపీఎల్ నిబంధనల్ని ఉల్లంఘించి.. మరో ఫ్రాంఛైజీతో చర్చలు సాగించాడని అందుకు ప్రతిఫలంగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు లలిత్ మోదీ. 'ఐపీఎల్ పాలక మండలి నిర్దేశించిన మార్గదర్శకాలు పవిత్రమైనవి.. వాటిని అందరు ఆటగాళ్లు కచ్చితంగా అనుసరించాలి. ఏ టీంతో అయినా, బీసీసీఐ లేదా ఐపీఎల్ యాజమాన్యంతో.. ఆటగాళ్లు గేమ్స్ ఆడటం, బ్లాక్‌మెయిలింగ్ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. దానిని ఏమాత్రం ఉపేక్షించం.' అని లలిత్ మోదీ చెప్పాడు.
దీంతో 2010 సీజన్ నుంచి జడేజా తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిథ్యం వహించిన జడేజా.. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. 2015 వరకు చెన్నైకి ఆడగా.. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్లు నిషేధంతో అప్పుడు గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. మళ్లీ 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడాడు. ఇన్నాళ్లకు చెన్నైని వీడాల్సి వస్తుందని తెలుస్తోంది. తొలి సీజన్ కోసం రాయల్స్.. జడేజా కోసం అప్పట్లో 30 వేల డాలర్లు వెచ్చించింది. 2008 సీజన్ ఆర్ఆర్ గెలవడంలో జడ్డూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 3,260 రన్స్ చేసి.. 170 వికెట్లు కూడా పడగొట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa