ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 24 నుంచి అయోధ్య రామమందిరం మూసివేత

national |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:40 PM

దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామలల్లా దర్శనంపై కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమైన జాతీయ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో.. నవంబర్ 24వ తేదీ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భక్తులకు రామమందిర దర్శనం ఉండదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. తిరిగి నవంబర్ 26న ఉదయం 7 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయి.


వివాహ పంచమి సందర్భంగా ధ్వజారోహణం..


నవంబర్ 25న వివాహ పంచమి సందర్భంగా ఈ చారిత్రక ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముచంద్రుడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం శిఖరాగ్రంలో 190 అడుగుల ఎత్తులో త్రిభుజ ఆకారంలోని జెండాను ఎగురవేయనున్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.


నవంబర్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య అతిథులు ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం అతిథులు రామలల్లాను దర్శించుకునేందుకు దాదాపు మూడు గంటల సమయం కేటాయించనున్నారు. అయితే ఆలయ ప్రాంగణం లోపల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల సంఖ్యను తగ్గించినట్లు చంపత్ రాయ్ స్పష్టం చేశారు. ఈశాన్య ఉత్తర ప్రదేశ్ ప్రాంత ప్రముఖులకు ఆహ్వానంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అతిథుల వసతి కోసం అయోధ్య అంతటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,600 గదులు సిద్ధం చేశారు.


అలాగే ప్రధాన మంత్రి మోదీ పర్యటన, ధ్వజారోహణం సందర్భంగా నవంబర్ 25న అయోధ్య నగరంలో 'రామ్ బరాత్' ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్థానికంగా ఉన్న 7 ప్రధాన దేవాలయాల ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులు జరుగుతాయి. ఇందులో రామ్ హర్షన్ కుంజ్, జానకీ మహల్, కనక్ భవన్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు.. నిర్వాహకులతో చర్చించి, సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ఊరేగింపులను ప్రారంభించాలని నిర్వాహకులను జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది. జిల్లా అధికార యంత్రాంగం త్వరలోనే దేవాలయాల సాధువులు, మహంత్‌లతో సమావేశం నిర్వహించి, భద్రతాపరమైన ఏర్పాట్లపై వారికి సమాచారం ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa