అండర్‌వరల్డ్ డ్రగ్స్ సిండికేట్‌కు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో పనిచేసే ఒక డ్రగ్స్ సిండికేట్‌పై గత కొన్ని రోజులుగా ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తు ఇప్పుడు బాలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి సహా పలువురు పేర్లు బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఆ డ్రగ్స్ సిండికేట్ ఏర్పాటు చేసిన పార్టీలకు బాలీవుడ్ హీరోహీరోయిన్లు, పలువురు హాజరైనట్లుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ రిమాండ్ కాపీలో పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
సలీం డోలా కుమారుడి వాంగ్మూలం కీలకం
ముంబై పోలీసులు యాంటీ నార్కోటిక్స్ సెల్ ఇటీవల దావూద్ అనుచరుడు.. వాంటెడ్ డ్రగ్ లార్డ్ సలీం డోలాకు చెందిన ఒక భారీ డ్రగ్స్ సిండికేట్ ముఠా గుట్టును రట్టు చేసింది. దుబాయ్ నుంచి ఈ సిండికేట్‌ను నడిపిన సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను ఆగస్ట్‌లో యూఏఈ నుంచి రప్పించి అరెస్ట్ చేశారు. తాహెర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ బాలీవుడ్ డొంక వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ఐదో నిందితుడు అయిన తాహెర్ డోలా.. దేశంలో, విదేశాల్లో డ్రగ్ పార్టీలను నిర్వహించడం.. ఆ పార్టీలకు డ్రగ్స్‌ను సరఫరా చేయడం చేస్తున్నట్లు ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తులో తేలిందని రిమాండ్ కాపీలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. తాహెర్ డోలా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. తాను నిర్వహించిన డ్రగ్స్ పార్టీలకు హాజరైన వారి పేర్లను వివరించాడు. బాలీవుడ్ హీరోయిన్లు నోరా ఫతేహి.. శ్రద్ధా కపూర్ ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్.. దావూద్ ఇబ్రహీం బంధువు అలీషా పార్కర్.. జిషాన్ సిద్ధిఖీ, ఓరీ, అబ్బాస్ మస్తాన్, లోకా సహా అనేక మంది ఇతర వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు.
నిందితుడు తాహెర్ డోలా.. వీరందరితో కలిసి భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా డ్రగ్ పార్టీలను నిర్వహించినట్లు గుర్తించారు. ఆ పార్టీల్లో స్వయంగా పాల్గొనడమే కాకుండా.. వారికి, ఇతరులకు తాహెర్ డోలా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆ రిమాండ్ కాపీలో పొందుపరిచారు. తాహెర్ డోలా ఇచ్చిన ఈ సంచలన వాంగ్మూలం నేపథ్యంలో.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అతడు చెప్పిన బాలీవుడ్ సహా పలువురు సెలబ్రిటీలను విచారణ కోసం త్వరలోనే వారికి సమన్లు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
2017లో వచ్చిన హసీనా పార్కర్ అనే సినిమాలో శ్రద్ధా కపూర్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌గా నటించడం.. ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ దావూద్‌గా నటించడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. ఈ వివాదంపై శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి లేదా వారి సన్నిహితుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa