కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కొడిన్హి. కేవలం 2400 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో ఏకంగా 450కి పైగా జత కవలలు నివసిస్తున్నారు. ఒక చిన్న గ్రామంలో ఇంతమంది కవలలు ఉండటం ప్రపంచంలోనే అరుదైన రికార్డుగా మారింది. దీన్ని బట్టి లెక్క వేస్తే ప్రతి 1000 మందికి సగటున 45 జతల కవలలు ఉన్నట్టు లెక్క వస్తోంది. ఇది సాధారణ ప్రపంచ సగటు కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ!
ఈ గ్రామంలో కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గత 15-20 ఏళ్లలోనే మరో 220 జతల కవలలు ఇక్కడ జన్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లో కూడా కవల పిల్లలు జన్మిస్తున్నారు. అంటే ఇది కేవలం స్థానిక కుటుంబాల జన్యు సమస్య మాత్రమే కాదని స్పష్టమవుతోంది. ఏదో ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఉన్న అంశం దీనికి కారణమని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జన్యుశాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు, యూనివర్శిటీలు ఈ రహస్యాన్ని కనుగొనేందుకు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. జర్మనీ, లండన్, అమెరికా నుంచి వచ్చిన బృందాలు కూడా ఇక్కడ శాంపిల్స్ సేకరించి, డేటా అధ్యయనం చేశాయి. కానీ ఇప్పటివరకు ఒక్క నిర్దిష్ట కారణం కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. నీరు, ఆహారం, వాతావరణం, మట్టి, జన్యు మ్యుటేషన్… అన్నీ పరీక్షలు జరిగాయి, కానీ రహస్యం ఇంకా బయటపడలేదు.
ఈ అంతుచిక్కని మిస్టరీ వల్ల ‘కొడిన్హి’ ఇప్పుడు ప్రపంచ ‘ట్విన్స్ విలేజ్’గా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ‘ట్విన్స్ ఫెస్టివల్’లో వందలాది కవలలు ఒకేసారి కనిపించే దృశ్యం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ చిన్న గ్రామం ఒక అద్భుతంగా మిగిలిపోతూ… శాస్త్రం కూడా ఓడిపోయిన రహస్యాన్ని ఇప్పటికీ కాపాడుతోంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa