దేశీయ ఆయుధ తయారీ సంస్థలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్ అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర ఆయుధాలను సమయానికి అందించడంలో విఫలమవుతున్నాయని, కొన్ని తమ ఉత్పత్తుల్లో స్వదేశీ భాగస్వామ్యం స్థాయిని ఎక్కువ చేసి చూపుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయుధ ఉత్పత్తి కంపెనీలు కొంచెమైనా దేశభక్తి చూపాలని జనరల్ చౌహన్ పేర్కొన్నారు. ‘లాభం కోసం చేసే ఆయుధ కంపెనీలు చేసే ప్రయత్నాల్లో కొంత దేశభక్తి, జాతీయత’ను సాయుధ దళాలు ఆశిస్తున్నాయని స్పష్టం చేశారు.
రెండు రోజుల కిందట జరిగిన యూఎస్ఐ సెమినార్‌లో జనరల్ అనిల్ చౌహన్ మాట్లాడుతూ.. ‘‘రక్షణ రంగ సంస్కరణలు ఏకపక్ష విధానం కాదు.. స్వదేశీ సామర్థ్యాల గురించి పరిశ్రమలు నిజాయితీగా ఉండాలి. మీరు మమ్మల్ని మధ్యలో వదిలేయలేరు. ఒక ఒప్పందంపై సంతకం చేసి, నిర్ణీత గడువులో సరఫరా చేయకపోతే అది మేము కోల్పోయిన సామర్థ్యంగా మారుతుంది’’ అని ఆయన అన్నారు.
అత్యవసర కొనుగోలు విధానంలోని ఐదు, ఆరు దశల్లో ఎక్కువ భాగం భారతీయ కంపెనీలు ‘అతిగా హామీలు ఇచ్చి’, నిర్దేశిత గడువులో సరఫరా చేయడంలో విఫలమైనట్టు ఆర్మీ తనకు నివేదించిందని సీడీఎస్ చెప్పారు. ఎమర్జెన్సీ కొనుగోలు విధానం నెమ్మదిగా సాగే ప్రక్రియను తప్పించి, ప్రతి ఒక్కటి రూ.300 కోట్ల విలువ గల ఒప్పందాలను వేగంగా కుదుర్చుకునే అధికారం సాయుధ దళాలకు కల్పిస్తుంది. ఈ ఒప్పందాలు ఒక ఏడాది లోపల అమలు చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. దీని ద్వారా త్రివిధ దళాలు క్షిపణులు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, కామికాజే డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు సహా ఇతర ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి సమకూర్చుకునే అవకాశం కలిగింది.
అయితే, ఆయుధాల తయారీకి ఒప్పందాలు చేసుకున్న పలు దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేయడానికి బదులు విదేశాల నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుని కేవలం అసెంబ్లింగ్ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జనరల్ అనిల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తిలో 70% స్వదేశీ సాంకేతికత ఉందని చెబుతున్నాయి. కానీ వాస్తవంగా పరిశీలిస్తే, అది అసలు అలా ఉండదు. ఈ విషయంలో మీరు నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆయుధ వ్యవస్థలు, కంపెనీల అధిక ధరలను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa