రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. 89 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఓరుగంటి శ్రీనివాస్‌ను చీఫ్ సెక్రెటరీగా నియమిస్తూ రాజస్థాన్ సర్కారు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో నవంబరు 17న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్సర్, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రాజస్థాన్ విజ్ఞప్తి మేరకు తిరిగి స్వరాష్ట్ర క్యాడర్‌కు మోదీ సర్కారు పంపింది. ఆ మర్నాడే సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించడం గమనార్హం. ఈ పదవిలో వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకూ కొనసాగుతారు.
ఓరుగంటి శ్రీనివాస్ 1966 సెప్టెంబరు 1న అరకు లోయలో జన్మించారు. ఆ సమయానికి శ్రీనివాస్ తండ్రి నేషనల్ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్‌గా అక్కడ పనిచేస్తున్నారు. ఆయన బాల్యం అరకు, తెలంగాణలోని దుమ్ముగూడెంలో సాగింది. భద్రాచలం పంచాయతీ స్కూల్‌లో ప్రాథమిక అనంతరం.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987లో కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ పూర్తిచేశారు. యూపీఎస్సీ సివిల్స్ 1989లో ఐఏఎస్‌కి ఎంపికయ్యారు.
ఆయన ఇటీవల రాసిన ‘టువర్డ్స్ ఏ న్యూ ఇండియా’ అనే పుస్తకంలో అరకులోయలోని గిరిజనులతో తనకు ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలున్నాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన శ్రీనివాస్.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనుమరాలిని వివాహం చేసుకున్నారు. సీఎస్ పదవితో పాటు రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, న్యూఢిల్లీలోని రాజస్తాన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్న ఐఏఎస్‌ల జాబితాలో శ్రీనివాస్ ఒక్కరే సీనియర్ కావడంతో ఆయనను సీఎస్‌గా నియమించారు.
రాజస్థాన్ క్యాడర్‌కు ఎంపికైన శ్రీనివాస్ భిలావర్ సబ్-డివిజినల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ కెరీర్ ప్రారంభమైంది. తర్వాత నింభేరా ఎస్డీఓగా నియమితులయ్యారు. అనంతరం 1995 నుంచి 98 వరకు వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ విభాగం డైరెక్టర్‌గా, తర్వాత పాలి, జోధ్‌పూర్ కలెక్టర్లుగా పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న జశ్వంత్ సింగ్‌కు ప్రయివేట్ సెక్రెటరీగా వ్యవహరించారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. శ్రీనివాస్ తన సర్వీసులో ఎక్కువ కాలంలో కేంద్రంలో డిప్యుటేషన్‌పై ఉన్నారు. కాగా, సెప్టెంబరు 22-23 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగిన 28వ నేషనల్ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa