ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరిశిక్షపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా

international |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 08:49 PM

మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) తనకు ఉరిశిక్ష విధిస్తూ వెలువరించిన తీరుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడని ప్రభుత్వంలోని తీవ్రవాదుల ధైర్యసాహసాలు, హత్యాకాండ ఉద్దేశాన్ని ఈ తీర్పు బయటపెట్టిందని ఆమె ఆరోపించారు. అన్ని ఆరోపణలను తిప్పికొట్టిన హసీనా.. తన పార్టీ అవామీ లీగ్, తనకు తమను తాము రక్షించుకునే అవకాశం కోర్టు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.


ట్రైబ్యునల్‌, దాని సభ్యులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించిన హసీనా.. న్యాయమూర్తులు, లాయర్లు ప్రస్తుత ప్రభుత్వానికి బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేశారని దుయ్యబట్టారు. ‘ఐసీటీలో నాపై చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాను.. గతేడాది జులై, ఆగస్టుల్లో జరిగిన మరణాలన్నింటిపైనా విచారం వ్యక్తం చేస్తున్నాను.. కానీ, నేను లేదా మా పార్టీ నాయకులు ఎవరూ ఆందోళనకారులను చంపమని ఆదేశించలేదు’ అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు.


‘‘కోర్టు నాకు న్యాయమైన రక్షణ అవకాశం ఇవ్వలేదు.. విచారణకు హాజరుకాకపోయినా నా తరఫున లాయర్లు ప్రాతినిధ్యం వహించేందుకు కూడా అనుమతించలేదు. పేరులో ‘ఇంటర్నేషనల్’ అనే పదం ఉన్నా, ఐసీటీలో అంతర్జాతీయత ఏమీ లేదు… అలాగే అది నిష్పాక్షికం కూడా కాదు... ఇది మోసపూరితమైన న్యాయ ప్రక్రియ’’ అంటూ తీర్పు వెలువడి కాసేపటికే హసీసా తీవ్రంగా విమర్శించారు.


హసీనా లేవనెత్తిన అంశాలు


1.సానుభూతి వ్యక్తం చేసిన సీనియర్ న్యాయమూర్తులు, లేదా సీనియర్ లాయర్లను ఇప్పటికే పదవి నుంచి తొలగించడం లేదా మౌనంగా ఉండాలని బెదిరించారు.


2. అవామీ లీగ్ పార్టీ సభ్యులను మాత్రమే ఐసీటీ ప్రత్యేకంగా విచారించింది.


3. మతపరమైన మైనార్టీలు, ఇతరులపై హింసను ప్రేరేపించిన వేరే పార్టీలకు చెందిన కుట్రదారులను విచారించడం లేదా కనీసం దర్యాప్తు చేయడానికి కూడా ప్రయత్నించలేదు.


‘ డాక్టర్ మహమ్మద్ యూనస్ నాయకత్వంలో అస్తవ్యస్త, హింసాత్మక, సామాజికంగా వెనుకబడిన పాలనలో ఇబ్బందులు పడుతోన్న లక్షలాది బంగ్లాదేశ్ ప్రజలు మోసపోరు.. ఐసీటీ చేపట్టిన విచారణలు న్యాయం కోసం ఏ రూపంలోనూ ఉద్దేశించేవి కావని స్పష్టంగా తెలుసుకుంటున్నాు.. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్నవారిని విచారించకుండా, అవామీ లీగ్‌పై నింద మోపడం డాక్టర్ యూనస్ వైఫ్యలాలను ప్రపంచం దృష్టి నుంచి మరల్చడమే’ అని హసీనా ధ్వజమెత్తారు. తనపై అభియోగాలను సరైన ట్రైబ్యునల్‌లో ఎదుర్కొనేందుకు భయపడనని హసీనా ప్రకటించారు. ‘‘ఇక్కడ సాక్ష్యాలను తూకం వేయవచ్చు... న్యాయంగా పరీక్షించవచ్చు.. అందుకే హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు ఈ ఆరోపణలను ఉంచాలని నేను మధ్యంతర ప్రభుత్వాన్ని పదేపదే సవాలు చేశాను’ అని ఆమె వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa