భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెప్టెన్లు ఎదుర్కొనే ఒత్తిడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి, 10 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన దానికంటే ఎక్కువ మానసికంగా, శారీరకంగా అలసిపోతామని అన్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యాల నుంచి ఎదురయ్యే నిరంతర ప్రశ్నలు, సమీక్షలే ఈ తీవ్ర ఒత్తిడికి కారణమని పరోక్షంగా వెల్లడించాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్, ఐపీఎల్ కెప్టెన్సీ అనేది కేవలం మైదానంలో వ్యూహాలు రచించడం మాత్రమే కాదని, ఫ్రాంచైజీ యాజమాన్యంతో నిరంతర సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యం లేని ఫ్రాంచైజీ యజమానులకు ఆటలోని సూక్ష్మ నైపుణ్యాలను వివరించడం చాలా కష్టమైన పని అని అభిప్రాయపడ్డాడు. ప్రతి చిన్న విషయానికి కెప్టెన్లు, కోచ్‌లు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇది మానసికంగా ఎంతో కుంగదీస్తుందని వివరించాడు.ఆటగాళ్ల ఎంపిక, వ్యూహాల్లో మార్పులు వంటి విషయాలపై కెప్టెన్లు, కోచ్‌లను పదేపదే ప్రశ్నిస్తారని రాహుల్ వివరించారు.ఆ మార్పు ఎందుకు చేశారు అతను తుది జట్టులో ఎందుకున్నాడు ప్రత్యర్థి 200 పరుగులు చేస్తే మనం కనీసం 120 ఎందుకు చేయలేకపోయాం వాళ్ల స్పిన్నర్లు అంత బాగా ఎలా బౌలింగ్ చేయగలుగుతున్నారు" వంటి ప్రశ్నలు ఎదురవుతాయని ఉదహరించాడు. ఇలాంటి పరిస్థితి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండదని, అక్కడ కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఆటపై పూర్తి అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు. క్రికెట్‌లో అన్ని విభాగాల్లో రాణించినా కొన్నిసార్లు విజయం దక్కదని, ఈ నిజాన్ని క్రికెట్ ఆట గురించి పెద్దగా తెలియని ఫ్రాంచైజీ యాజమాన్యాలకు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్ అని అన్నాడు.కేఎల్ రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఐపీఎల్ గతం కూడా బలాన్ని చేకూరుస్తోంది. 2022 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో జట్టును ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లినప్పటికీ, 2024 సీజన్‌లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో ఓటమి అనంతరం, ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో తీవ్ర స్వరంతో మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ సంఘటన తర్వాత, రాహుల్ లక్నో ఫ్రాంచైజీని వీడి మెగా వేలంలోకి వచ్చాడు. అక్కడ అతడిని దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో, తన సొంత అనుభవాల నుంచే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడని స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa