ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 17 పెళ్లి రోజు నాడే,,,,బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు

international |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 09:32 PM

బంగ్లాదేశ్‌లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మానవత్వానిక వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో బంగ్లా కోర్టు ఆమెని దోషిగా నిర్ధారిస్తూ సోమవారం అనగా నవంబర్ 17న తీర్పు వెల్లడించింది. ఆమె మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హసీనా అత్యధిక శిక్షకు అర్హులరాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ప్రకటించింది. గతంలో బంగ్లాదేశ్‌లో నిరసనలకు దిగిన ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారని.. అందుకే ఆమెకు మరణ శిక్ష విధిస్తున్నామని కోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పు నవంబర్ 17న వెలువడటం గమనార్హం. ఎందుకంటే నవంబర్ 17తో షేక్ హసీనాకు విడదీయరాని అనుబంధం ఉంది. నవంబర్ 17 ఆమె పెళ్లి రోజు.


అవును మ్యారేజ్ డే నాడే బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకు శిక్ష విధించడం గమనార్హం. 1967 నవంబర్ 17న హసీనా వివాహం చేసుకున్నారు. డా.ఎం.ఎ. వాజెద్ మియా అనే వ్యక్తితో ఆమె వివాహం అత్యంత నిరాడంబరంగా.. సన్నిహితుల మధ్య జరిగింది. అప్పుడు బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొని ఉండటంతో వీరి వివాహం అత్యంత గోప్యంగా.. సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వివాహం సమయంలో హసీనా తండ్రి రెహమాన్ జైలులో ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత హసీనా తన తండ్రి ఆశీర్వాదం కోసం నేరుగా జైలుకు వెళ్లారు.


దీంతో ఆయన జైలు నుంచే నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహం సందర్భంగా రెహమాన్ తన అల్లుడు వాజెద్‌కు రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు. మామగారు ఇచ్చిన వాచ్‌ను వాజెద్ జీవితాంతం అరుదైన, విలువైన ఆస్తిగా దాచుకున్నారట. ఈక్రమంలో మ్యారేజ్ డే నాడే హసీనాకు మరణశిక్ష విధించడం విధి నిర్ణయం అంటున్నారు. హసీనాకు విధించిన మరణశిక్ష మీద బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందిస్తూ.. తీర్పును సమర్థించింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దేశ న్యాయస్థానాలు కేవలం బంగ్లాదేశ్‌కు మాత్రమే దేశం బయట సైతం గుర్తుంచుకునిపోయే తీర్పును వెలువరించాయి. చట్టం ముందు అందరు సమానులే అని.. అధికారంలో ఉన్నా లేకున్నా.. చట్టానికి ఎవరూ అతీతులు కారనే ప్రాథమిక సూత్రాన్ని న్యాయస్థానం తన తీర్పుతో మరోసారి స్పష్టం చేసింది’ అన్నారు. తాము ఈ తీర్పును బలంగా సమర్థిస్తున్నామని యూనస్ ప్రకటించారు.


ఈ తీర్పుపై హసీనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పని.. ప్రజల చేత ఎన్నకోబడని.. ఒక అనామిక ప్రభుత్వ ఒత్తిడితో న్యాయస్థానాలు వెల్లడించిన అన్యాయకరమైన తీర్పు ఇది. ఇది పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో ఇలాంటి తీర్పు వెల్లడించారని స్పష్టం అవుతోంది. ప్రజల చేత ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకోబడిన నన్ను.. నా పార్టీని నిర్వర్యం చేసే కుట్రనే ఈ తీర్పు. ఈకేసు విచారణ పారదర్శకంగా జరగలేదు.. ఇలాంటి తీర్పులు ఎన్ని వెలువడినా నేను భయపడను. తాత్కాలిక ప్రభుత్వం ఈ తీర్పును ఒక సాకుగా చూసి.. వారి అస్తవ్యస్త పాలనను అద్భుతంగా ఎందని చెప్పుకుంటుందని’ హసీనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడంతో.. అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు.. దేశ రాజధాని ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.. లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa