నిప్పుల కొలిమిలో కాలితేనే బంగారం ఆభరణంగా మారుతుంది. అందుకే మనం ఏదైనా సాధించాలనుకుంటే.. ఓటమి కారణంగా ఆగిపోకూడదు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా.. ప్రయత్నం మాత్రం ఆపకూడదు. అందుకే, ఓడిపోవడం కాదు.. ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి అంటారు స్వామి వివేకానంద. దీనికి నిలువెత్తు నిదర్శనం ఓ వ్యక్తి. చదివింది 12వ తరగతి. ఈ చదువుకు ఏ కలెక్టర్ గిరి చేద్దాములే.. ఏదో ఒక చోట సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేద్దామని అనుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఆ ఉద్యోగానికి కూడా అతడి చదవు సరిపోలేదు. మరోచోట కంపెనీ లోగో గుర్తుపట్టలేదని అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. అయితే అతడు కూర్చుని కుమిలిపోలేదు. నిజానికి ఈ తిరస్కరణలతోనే అతడి అసలైన ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇది అతడి విజయ గాథ.
బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ 12వ తరగతి చదివి.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఆ పని ఇష్టం లేక.. తన చదువుకు తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగంలో స్థిరపడదామనుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు దరఖాస్తు చేస్తే.. విద్యార్హతలు సరిపోవంటూ తిరస్కరించారు. అక్కడితో ఆగకుండా అనేక ఇంటర్వ్యూలకు వెళ్లినా ఫలితం శూన్యం. ఓ చోట యాపిల్ లోగోను గుర్తించలేకపోవడంతో ఉద్యోగం పొందలేకపోయాడు. అయితే ఇంటర్య్వూలకు తిరిగే క్రమంలో అతడికి తన అసలైన గమ్యం ఏంటో తెలిసివచ్చింది.
అతడికున్న ఆటో డ్రైవర్ అనుభవమే దారి చూపించింది. నగరాల మధ్య రాకపోకలు సాగించాలంటే.. సురక్షితమైన ప్రయాణ సౌకర్యం లేదు. ఇక సుదూర ప్రాంతాలకు టాక్సీల్లో వెళ్లాలంటే ఖరీదైన వ్యవహారం. ఆటోడ్రైవర్‌గా ఉన్నప్పుడు చాలా మంది ప్యాసింజర్లు కూడా దిల్‌ఖుష్‌కు ఇదే విషయం చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ధైర్యమే పెట్టుబడిగా.. 2016లో "రోడ్‌బెజ్" అనే యాప్ ప్రారంభించాడు.
రోడ్‌బెజ్ ఒక విశ్వసనీయ నెట్‌వర్క్. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి ట్యాక్సీ సర్వీసులను అందిస్తుంది. కార్ పూలింగ్, రైడ్ షేరింగ్ సేవలను అందింస్తుంది. ప్రయాణికులు రైడ్ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇందులో రానుపోను ఛార్జీలు ఉండవు. కేవలం పోవడానికైనా, రావడానికైనా.. ప్రయాణించిన దూరానికే ఛార్జీలు తీసుకుంటారు. దీంతో దూర ప్రయాణాల ఖర్చుల భారం కూడా ఉండదు. మొదట తాను ఉండే చుట్టుపక్కల ప్రాంతాలకే సేవలు అందించేవాడు. 2021 బిహార్‌లో.. ఉన్న ప్రతి నగరాన్ని అనుసంధానించేలా యాప్‌ను లాంచ్ చేశాడు.
దిల్‌ఖుష్ ఆలోచనను పెట్టుబడిదారులు నమ్మడంతో.. రూ. 40 లక్షల ప్రారంభ నిధులు సమకూరాయి. ఇక ప్రయాణికుల్లో నమ్మకం పెంచేలా.. గ్యారంటీలు ప్రకటించాడు. ఒకవేళ రోడ్‌బెజ్ డ్రైవర్ పొరబాటు కారణంగా విమానం మిస్సైతే.. కంపెనీ కొత్త టికెట్ బుక్ చేస్తుంది. అంతకుముందు ఇలాంటి ఆఫర్‌ను ఏ సంస్థ ఇవ్వలేకపోవడం గమనార్హం. దీంతో కేవలం 7 నెలల్లోనే దిల్‍ఖుష్ రోడ్‌బెజ్ టీమ్ ఏకంగా రూ. 4కోట్ల నిధులను రాబట్టింది.
షార్క్ ట్యాంక్ ఇండియా షోలోనూ పాల్గొన్నాడు దిల్‌ఖుష్. ఓయో రితేష్ అగర్వాల్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన నమితా థాపర్.. రోడ్‌బెజ్‌లో రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. అలా చాలా తక్కువ సమయంలోనే వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టించింది రోడ్‌బెజ్. ఇప్పుడు ఈ కంపెనీ విలువ దాదాపు రూ. 400 కోట్లు కావడం గమనార్హం. ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొని.. స్టార్టప్‌లతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరచుకోవచ్చు. అయితే కొందరిలో ఇలాంటి ఆలోచనలు, పట్టుదల.. మాత్రం ఓటమితో రాటు తేలిపోతేనే వస్తాయని దిల్‌ఖుష్ కుమార్ నిరూపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa