ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు.. ‘నాటో నన్ను డాడీ అంటుంది’,,,మరో చిచ్చు రాజేసిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 09:34 PM

సుంకాలతో ప్రపంచ దేశాల మీద విరుచుకుపడుతున్న ట్రంప్.. తాజాగా మరో వివాదాన్ని రాజేశారు. ఈసారి మిత్ర దేశాలను సైతం వదలలేదు. మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాల మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రష్యాతో యుద్ధంలో భాగంగా.. యూరోపియన్ దేశాలు.. ఉక్రెయిన్ పట్ల ప్రవర్తిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. యూరప్ వలసల విషయంలో బలహీనంగా ఉందని, ఉక్రెయిన్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అమెరికా-యూరప్ దేశాలకు మధ్య ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి.


ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాటో (NATO) కూటమిపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ఈ కూటమి తనను డాడీ అని పిలుస్తుందని పేర్కొన్నారు. మరోవైపు యూరోపియన్ దేశాలు రక్షణ వ్యయంపై చాలా గొప్ప ప్రసంగాలు చేస్తాయి తప్ప యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కైవ్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి వస్తుందని.. యూరప్‌లోని చాలా మంది తీవ్ర భయాందోళనకు గురవుతున్న సమయంలో.. యుద్ధాన్ని ముగించాలనే అమెరికా ప్రణాళికపై విభేదాలు పెరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఇచ్చే అంశంపై ట్రంప్‌ను ఒప్పించేందుకు యూరోపియన్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ ఆ దేశాల మీదనే ఇలా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.


వారం రోజుల క్రితం అమెరికా విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహంలో కూడా ట్రంప్ యూరప్ దేశాలపై ఇలాంటి విమర్శలే చేశారు. వలసల కారణంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు నాశనం అవుతున్నాయంటూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్‌లోని నేతలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చాలా యూరోపియన్ దేశాలు క్షీణిస్తున్నాయని ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వలసదారుల విషయంలో యూరప్ దేశాల విధానాలు ఒక విపత్తు అంటూ ట్రంప్ అభివర్ణించారు.


రష్యా తో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్ కోరారు. కానీ పరిస్థితులు మాత్రం రష్యాకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌లో 2024 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 2022లో రష్యా దాడి మొదలైన నాటి నుండి సైనిక చట్టం అమలులో ఉండటంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో సుమారు 20 శాతం భూభాగం ఆక్రమణలో ఉంది. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. భద్రత కల్పించినట్లయితే తాను "ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను" అని మంగళవారం ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa