ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెస్సీ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సీఎం.. కమిటీ ఏర్పాటు, వివరణ కోరిన గవర్నర్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:23 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కోల్‌కతాలో మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని వచ్చి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. దాదాపు అరగంట పాటు మెస్సీ అక్కడ ఉన్నా.. తమ అభిమాన ఆటగాడిని చూడలేకపోయిన కోపంతో వారు ఈ అల్లర్లకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీకి, ఆయన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. జరిగిన సంఘటనపై విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.


ఈ అనూహ్య సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ.. ఈ దురదృష్టకర సంఘటనపై మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణ చెప్పారు. ఈ ఘటన కారణాన్ని గుర్తించడానికి.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి.. రిటైర్డ్ జడ్జి ఆశిమ్ కుమార్ రే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా విచారణ కమిటీని నియమించారు. రూ. 3,500 నుంచి రూ. 14,000 వరకు టికెట్లు కొన్నప్పటికీ మెస్సీని చూడలేకపోతున్నామనే కారణంగానే ఈ అల్లర్లు చెలరేగాయని.. బీజేపీ నేతలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


తన మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇవాళ కోల్‌కతాకు చేరుకున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని చూసేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులు తమ అభిమాన ఆటగాడిని చూడలేకపోవడంతో ఆగ్రహంతో సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు. బాటిల్స్, కుర్చీలు విసిరి.. సాల్ట్ లేక్ స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. గోట్ టూర్ నిర్వాహకులు.. ప్రమోటర్ శతద్రు దత్తాతో కలిసి వెంటనే అక్కడి నుంచి మెస్సీని తరలించాల్సి వచ్చింది, దీంతో ఆ ఈవెంట్ అర్ధాంతరంగా ముగిసింది.


సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ గందరగోళం కారణంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద సరైన కార్యక్రమ నిర్వహణ లేకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అది చూసి తాను తీవ్ర ఆందోళన చెందానని.. ఈ దురదృష్టకర సంఘటన జరిగిన నేపథ్యంలో లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడాభిమానులందరికీ తాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని దీదీ ప్రకటించారు.


ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులను గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనను బీజేపీ తీవ్రంగా విమర్శిస్తూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. అంతర్జాతీయ వేదికపై ఇది చాలా అవమానమని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.


మెస్సీ వంటి అంతర్జాతీయ దిగ్గజం వస్తున్నప్పటికీ.. కనీస ప్రణాళిక గానీ, భద్రత గానీ లేదని ఆయన మమతా బెనర్జీని విమర్శించారు. ఇది చరిత్ర పేజీల్లో చెరిగిపోని పెద్ద అవమానమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అభివర్ణించారు. సామాన్య ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నందుకు.. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa