ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు గీత, మహాభారతం పాఠాలు.. సంస్కృతంలో బోధన,,పాకిస్థాన్ సంచలన నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:43 PM

భారత దేశ విభజన జరిగిన తర్వాత తొలిసారిగా.. సంస్కృత భాష పాకిస్థాన్‌లోని అకడమిక్ తరగతి గదుల్లో అడుగు పెట్టింది. లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ విద్యార్థులు, పండితుల నుంచి వచ్చిన బలమైన ఆసక్తి మేరకు.. ఈ ప్రాచీన భాషలో నాలుగు క్రెడిట్‌ల కోర్సును ప్రారంభించింది. ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఫార్మాన్ క్రిస్టియన్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీగా పని చేస్తున్న డా. షాహిద్ రషీద్ కృషి ఎంతగానో ఉంది. డాక్టర్ రషీద్ కృషి కారణంగానే సంస్కృతం తిరిగి పాకిస్థాన్ విద్యావ్యవస్థలో ప్రాధాన్యతను సంతరించుకుంది.


సంస్కృతం నేర్చుకోవాలనే తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారికి డా. రషీద్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. "మనం ఎందుకు నేర్చుకోకూడదు? సంస్కృత వ్యాకరణవేత్త పాణిని నివసించిన గ్రామం ఈ ప్రాంతంలోనే ఉంది. సింధు లోయ నాగరికత సమయంలో ఎన్నో రచనలు ఇక్కడే జరిగాయి. సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. ఇది మనకూ చెందినదే. ఇది ఏ ఒక్క మతానికి మాత్రమే పరిమితం కాదు" అని ఆయన ఉద్ఘాటించారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రజలు ఒకరి సంస్కృతిని, సంప్రదాయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. మరింత సామరస్యం నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.


"భారతదేశంలో హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకోవడం, పాకిస్థాన్‌లో ముస్లింలు సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభిస్తే.. ఇది దక్షిణాసియాకు ఒక కొత్త, ఆశాజనకమైన ప్రారంభం అవుతుంది. అక్కడ భాషలు అడ్డంకులుగా కాకుండా వారధులుగా మారతాయి" అని డా. రషీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గుర్మాని సెంటర్ డైరెక్టర్ డా. అలీ ఉస్మాన్ ఖాస్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంజాబ్ యూనివర్శిటీ లైబ్రరీలో అత్యంత సుసంపన్నమైన, నిర్లక్ష్యం చేయబడిన సంస్కృత ఆర్కైవ్‌లు పాకిస్థాన్‌లో ఉన్నాయని తెలిపారు. 1930లలో పండితుడు జెసీఆర్ వూల్నర్ వీటిని నమోదు చేసినప్పటికీ.. 1947 తర్వాత పాకిస్థాన్ పండితులు ఎవరూ వాటిని అధ్యయనం చేయలేదని, విదేశీ పరిశోధకులు మాత్రమే ఉపయోగిస్తున్నారని అన్నారు. స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితి మారుతుందని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కృత కోర్సులో భాగంగా.. విద్యార్థులకు ప్రసిద్ధ మహాభారతం టీవీ సిరీస్‌లోని "హై కథా సంగ్రామ్ కీ" అనే థీమ్ ఉర్దూ అనువాదాన్ని కూడా చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీత వంటి హిందూ పురాణాలపై మరిన్ని కోర్సులను విస్తరించాలని LUMS లక్ష్యంగా పెట్టుకుంది. డా. ఖాస్మి అభిప్రాయం ప్రకారం.. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలలో పాకిస్థాన్ నుంచే గీత, మహాభారతంపై పరిశోధన చేసే పండితులు వస్తారని తెలిపారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa