అమాయకుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటిని విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని ‘అద్దె ఖాతాల’ దందా సాగిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.ఈ ముఠా బాధితులకు నగదు ఆశ చూపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తుంది. అలా విజయవాడకు చెందిన దేవదాసు అనే నిరుద్యోగి పేరుతో ఖాతా తెరిపించి, అతనికి కేవలం రూ. 7 వేలు ఇచ్చారు. అయితే, ఇటీవల తన ఖాతాను తనిఖీ చేసుకున్న దేవదాసు అందులో ఏకంగా రూ. 2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ ముఠా సేకరించిన బ్యాంక్ కిట్‌లను పార్వతి అనే మహిళ ద్వారా ఫిలిప్పీన్స్‌లోని ప్రధాన సూత్రధారులకు చేరవేసేవారు. అక్కడి నుంచే బెట్టింగ్‌లు, సైబర్ మోసాలకు సంబంధించిన సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లించేవారు. ప్రతి ఖాతాపై ఈ ముఠాకు రూ. 30 వేల వరకు కమీషన్ అందేది. ఏపీతో పాటు తెలంగాణ, బెంగాల్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో జరిగిన మోసాలకు ఈ ఖాతాలనే వాడినట్లు పోలీసులు గుర్తించారు.ముఠా నాయకుడు సూర్య గతంలోనే ఆగ్రాలో ఇలాంటి కేసులోనే జైలుకు వెళ్లి వచ్చాడు. విడుదలయ్యాక మళ్లీ టెలిగ్రామ్ ద్వారా ఈ దందాను విస్తరించాడు. నిందితుడి కారుపై ఏకంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ఉన్న 'ఎమ్మెల్యే' స్టిక్కర్‌ను పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కీలక నిందితురాలు పార్వతి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa