నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్భణం పెరుగుదలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఇరాన్ ప్రజలు చేస్తోన్న ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న జీవన వ్యయం, భద్రతా బలగాల అణచివేత చర్యలతో ఆగ్రహించిన ఇరానియన్లు, వీధుల్లోకి వచ్చి మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాత్రివేళలో ఆందోళనలు మరింత ఉద్ధృతం కావడంతో ఇంటర్నెట్, అంతర్జాతీయ టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాల మధ్య, దేశ న్యాయవ్యవస్థ, భద్రతా దళాల చీఫ్‌లు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నిరసనలపై అమెరికా అధ్కక్షుడు ట్రంప్ స్పందించిన సంగతి తెలిసిందే.
1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్‌ను పాలించిన బహిష్కృత యువరాజు రెజా పహ్లావి పిలుపు మేరకు గురువారం, శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘నియంత మరణం!’, ‘ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అంతం’ వంటి నినాదాలతొ హోరెత్తించారు. ‘ఇది చివరి యుద్ధం! పహ్లావి తిరిగి వస్తారు!’ కొందరు షాకు మద్దతుగా నినదించారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. కానీ వెంటనే కమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేశారు.
‘ఇరానియన్లు ఈ రాత్రి తమ స్వేచ్ఛను కోరుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్‌లోని పాలకులు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలను మూసివేశారు’ అని పహ్లావి అన్నారు. ‘ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.. ల్యాండ్‌లైన్‌లను కట్ చేసింది. శాటిలైట్ సిగ్నల్స్‌ను కూడా జామ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాదిరిగా ఐరోపా నాయకులు.. ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలవాలి.. మా పౌరుల గొంతులు మూగబోకుండా చూడాలి’" అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇరాన్‌లో నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకూ కనీసం 42 మంది మరణించగా, 2,270 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారని అమెరికా కేంద్రంగా పనిచేసే మానవహక్కుల సంస్థ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే ఇంటర్నెట్ నిలిచిపోయింది. గతంలో ఇలాంటి చర్యల తర్వాత ప్రభుత్వ అణచివేతలు తీవ్రమయ్యాయి.
ఇరాన్‌లో తొలిసారి టెహ్రాన్ గ్రాండ్ బజార్‌లో గతేడాది డిసెంబరులో ప్రారంభమయ్యాయి. కరెన్సీ పతనం, ద్రవ్యోల్బణం, రాజకీయ, సామాజిక స్వేచ్ఛలపై ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 52 శాతానికి చేరుకుంది. ఇరాన్ అధికారులు ఆర్థిక ఇబ్బందులను అంగీకరించారు, కానీ విదేశీ శక్తులు నిరసనలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి గుండాలా వ్యవహరిస్తే సహించేది లేదని సుప్రీం నేత ఖమేనీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇతరుకు చెప్పే ముందు మీ సొంత దేశంపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సూచించారు. ఇతర దేశాధినేతను సంతోషపెట్టేందుకు సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళనకారులపై మండిపడ్డారు. గత వారం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్నవారిని చంపితే, అమెరికా చూస్తూ కూర్చోదని, అలా చేస్తే, నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది’ అని ట్రంప్ హెచ్చరించారు.
సంస్కరణవాది అయిన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని ఇరాన్ పౌర ప్రభుత్వం.. నిరసనకారులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నిరసనకారుల చట్టబద్ధమైన డిమాండ్లను అధ్యక్షుడు అంగీకరిస్తూ, ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa