ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఎలాగోలా మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ సమాజం ఏమంటుందోనని భయపడి.. ఆ పుట్టిన బిడ్డను 3 రోజులకే తీసుకెళ్లి ఓ అనాథాశ్రమంలో వదిలేసింది. ఇక ఆ పసిబిడ్డకు ఓ నర్సు పేరుపెట్టింది. ఆ తర్వాత ఓ విదేశీ జంట ఆ పసి బిడ్డను దత్తత తీసుకుని నెదర్లాండ్స్‌కు వెళ్లింది. అక్కడే పెరిగి, చదువుకుని.. రాజకీయాల్లోకి వచ్చి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అతడికి తన తల్లి ఎవరో తెలుసుకోవాలని.. ఆమెను కలుసుకోవాలని ఆరాటపడేవాడు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వచ్చి.. తన తల్లి గురించి వెతికేవాడు. ఇప్పటికే రెండు సార్లు వచ్చి వెతికినా తన తల్లి జాడ దొరకలేదు. కానీ ఈసారి చిన్నతనంలో పేరు పెట్టిన నర్సు ఆచూకీ దొరకడంతో తన తల్లిని వెతికేందుకు మార్గం సుగమం అయిందని సంబరపడుతున్నాడు.
నెదర్లాండ్స్‌లోని హీమ్‌స్టెడ్ నగర మేయర్ అయిన ఫాల్గుణ్ బిన్నెండిజ్క్ కథ ఒక సినిమాను తలపిస్తుంది. నాగ్‌పూర్‌లో పుట్టిన ఫాల్గన్ బిన్నెండిజ్క్‌ను ఆమె తల్లి మూడు రోజుల పసికందుగా ఉన్నప్పుడే వదిలేసింది. 1985 ఫిబ్రవరి 10వ తేదీన ఫాల్గుణ్ నాగ్‌పూర్‌లో జన్మించారు. పెళ్లి కాకుండానే తల్లి కావడంతో.. సామాజిక పరిస్థితుల వల్ల ఆయన 21 ఏళ్ల తల్లి ఆయనను నాగ్‌పూర్‌లోని మాతృ సేవా సంఘ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
ఆయన పుట్టింది హిందూ క్యాలెండర్ ప్రకారం చివరి నెల అయిన ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి) కావడంతో.. అక్కడి నర్సు ఆయనకు ఫాల్గుణ్ అని పేరు పెట్టారు. కొన్ని వారాల తర్వాత ఒక డచ్ జంట ఫాల్గన్‌ను దత్తత తీసుకుని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించి హీమ్‌స్టెడ్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఫాల్గుణ్ తన జీవితంలో అంతా ఉన్నా.. ఏదో వెలితిగా భావించేవారు. తనను కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం ఆయనను 3 సార్లు నాగ్‌పూర్‌కు వచ్చేలా చేసింది. 2006 మొదట పర్యాటకునిగా ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయులు ఆయనను చూసి హిందీలో మాట్లాడటంతో.. తన మూలాలు తెలుసుకోవాలని మరింత ఆసక్తి పెరిగింది. ఇక రెండోసారి 2017లో మాతృ సేవా సంఘ్‌కు వెళ్లి పాత రికార్డులు పరిశీలించగా.. తల్లి పేరు మాత్రమే లభించింది. కానీ అడ్రస్ లేకపోవడంతో ఆమెను వెతకడం సాధ్యం కాలేదు. ఇక ఇటీవల 2025 డిసెంబర్‌లో తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఫాల్గన్ నాగ్‌పూర్ వచ్చారు.
ఈ పర్యటనలో ఒక అద్భుతం జరిగింది. నాగ్‌పూర్ జిల్లా యంత్రాంగం సహాయంతో 40 ఏళ్ల క్రితం మాతృ సేవా సంఘ్‌లో పనిచేసిన ఒక రిటైర్డ్ నర్సును ఫాల్గుణ్ గుర్తించారు. ఆమెను కలిసినప్పుడు.. ఆ నర్సు ఫాల్గుణ్‌ను గుర్తుపట్టి.. ఆయనకు పేరు పెట్టింది తానేనని చెప్పడంతో వారిద్దరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన జీవితానికి గుర్తింపునిచ్చిన వ్యక్తిని 40 ఏళ్ల తర్వాత కలవడం అత్యంత భావోద్వేగమైన క్షణమని ఫాల్గుణ్ పేర్కొన్నారు.
కర్ణుడు - కుంతి స్ఫూర్తి
మహాభారతంలోని కర్ణుడి పాత్ర తనకు చాలా ఇష్టమని ఫాల్గుణ్ చెప్పారు. ప్రతీ కర్ణుడికి తన కుంతిని కలిసే హక్కు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తనను పుట్టగానే వదిలేసినందుకు తన తల్లి ఇప్పటికీ తప్పుచేశాననే భావనతో బతుకుతూ ఉండవచ్చని పేర్కొన్నారు. తన తల్లిని కలిసి తాను చాలా బాగున్నానని.. తనను ప్రేమిస్తూ పెంచిన కుటుంబం తనకు దొరికిందని చెప్పడమే తన లక్ష్యమని ఫాల్గుణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ అభినవ కర్ణుడు.. కుంతిని కలుసుకోవాలని.. ఫాల్గుణ్ కోరిక త్వరలోనే నెరవేరాలని మనమంతా ఆశిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa