ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో బలపడుతోన్న ఇస్లామిక్ పార్టీ.. కలవరానికి గురవుతోన్న మైనార్టీలు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 08:53 PM

వచ్చేనెల బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల జరగనున్న వేళ ఒకప్పుడు స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిలబడి, దశాబ్దానికి పైగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ , తనను తాను పునరుద్ధరించుకుని, కొత్త మద్దతును కూడగట్టుకుంటోంది. ఇది మితవాదులు, మైనారిటీ వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన యువత నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత ఈ మార్పు మొదలైంది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించడంతో జమాతే తన అవినీతి వ్యతిరేక ప్రతిష్ట, సంక్షేమ కార్యక్రమాలు, మరింత సమ్మిళితమైన ప్రజా వైఖరితో ఉత్తమ ప్రదర్శన కనబరచాలని చూస్తోంది.


డిసెంబర్‌లో జరిగిన ఓ ప్రజాభిప్రాయ సేకరణలో జమాతేను అత్యంత ఇష్టపడే పార్టీగా పేర్కొన్నారు. ‘‘మేము సంక్షేమ రాజకీయాలు ప్రారంభించాం.. ప్రతికార రాజకీయాలు కాదు’ అని జమాతే చీఫ్ షఫికుర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. వరదల సమయంలో సహాయకచర్యలు, తిరుగుబాటులో మరణించిన వారి కుటుంబాలకు సహాయం వంటి కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. ‘జమాతే దాని అనుబంధ సంస్థలు ఇప్పుడు చేస్తున్న నిర్మాణాత్మక రాజకీయాలపై ప్రజలు విశ్వాసం ఉంచుతారు’ అని రెహమాన్ పేర్కొన్నారు.


జమాతే ఇస్లామీ మూలాలు 1940ల ప్రారంభంలో భారతదేశంలో ఉద్భవించిన పాన్-ఇస్లామిస్ట్ ఉద్యమంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని జమాతే వ్యతిరేకించింది. హసీనా పాలనలో యుద్ధ నేరాల విచారణకు సంబంధించిన చాలా మంది జమాతే నేతలకు మరణశిక్ష విధించారు లేదా జైలులో పెట్టారు. దాని సిద్ధాంతాలు బంగ్లాదేశ్ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని 2013లో కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. కానీ, గతేడాది దానిపై నిషేధం ఎత్తివేశారు. ఢాకా విశ్వవిద్యాలయ ఎన్నికలలో జమాతే విద్యార్థి విభాగం విజయం సాధించింది. 


కొన్ని నెలల తర్వాత ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది. ఇది జమాతే ప్రతిష్ట పెరగడానికి దోహదం చేస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మాకు ఏదో కొత్తది కావాలి, ఆ కొత్త ఎంపిక జమాత్.. వారికి మంచి పేరుంది, దేశం కోసం పనిచేస్తారు... అని మొహమ్మద్ జలాల్ అనే వ్యాపారి అన్నారు. పార్టీ తన వైఖరిని మార్చుకోవడం, నిషేధం నుంచి పునరావాసం పొంది, ఆచరణాత్మక పోటీదారుగా మారడం, హసీనా పాలనలో జరిగిన దుర్వినియోగాలపై ప్రజల ఆగ్రహం వల్ల సాధ్యమైందని రాజకీయ విశ్లేషకుడు షఫీ మొస్తఫా అన్నారు.


‘అవామీ లీగ్ నిరంకుశ ధోరణులు విస్తృతమైన నిరాశను సృష్టించాయి.. ‘ఇస్లాం ఒక పరిష్కారం’ అనే జమాత్ నినాదం పునరుద్ధరణకు నైతిక ప్రత్యామ్నాయంగా తమను తాము ప్రదర్శించుకోవడానికి అనుమతించింది’ అని మొస్తఫా పేర్కొన్నారు. తొలిసారిగా జమాత్ ఒక హిందూ అభ్యర్థిని నామినేట్ చేసింది. మైనార్టీలపై ఇటీవల జరిగిన దాడులను ఖండించింది. ఇస్లామిక్ సూత్రాల మార్గదర్శకత్వంలో బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తామని పార్టీ నాయకులు హామీ ఇచ్చారు, అయితే 300 పార్లమెంట్ స్థానాలకు మహిళా అభ్యర్థులను ప్రకటించలేదు. రెహమాన్ ప్రకారం.. ఎన్నికల తర్వాత కేటాయించే 50 సీట్ల ద్వారా మహిళలు ప్రాతినిధ్యం పొందవచ్చు. అయితే, మహిళా కార్యకర్తలు ఈ హామీలను ఎన్నికల ఎత్తుగడగా కొట్టిపారేశారు. ‘తమ సిద్ధాంతానికి తిరిగి వస్తారు, ఇందులో మహిళలపై అన్ని రంగాలలో ఆంక్షలు ఉంటాయి’ అని షిరీన్ హుక్ అనే ఒక మహిళా కార్యకర్త అన్నారు.


హసీనా నిష్క్రమణ తర్వాత, ఇస్లామిస్ట్ గ్రూపులు మరింత రెచ్చిపోతున్నాయి. హిందూ, సూఫీ మందిరాలపై దాడులకు పాల్పడుతూ... ఇస్లామిక్‌కు విరుద్ధమని భావించే కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలను ఖండించిన యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. మైనారిటీలను రక్షిస్తామని హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గం, జనాభాలో సుమారు 8% ఉన్నారు. ఏ ప్రభుత్వంలోనూ మైనార్టీలకు నిజమైన రక్షణ లభించలేదని, ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న భయం, అభద్రతాభావం తీవ్రంగా ఉందని అని ఒక మైనారిటీ వర్గ నాయకుడు చెప్పారు.


జమాతే ఇస్లామ్ 2001 నుంచి 2006 వరకు BNP నేతృత్వంలోని ప్రభుత్వంలో ఒక చిన్న సంకీర్ణ భాగస్వామిగా ఉంది. ఇతర ఇస్లామిస్ట్ పార్టీలు, సంప్రదాయవాద పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకుంది. గతేడాది ఆరంభంలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం ప్రారంభించింది. తాము 179 స్థానాల్లో పోటీ చేస్తామని, 74 స్థానాల్లో ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాలకు కేటాయించినట్టు తెలిపింది. అయితే, ఒక పార్టీ వైదొలగడంతో మరో 47 స్థానాలు ఇంకా పంచుకోవాల్సి ఉంది.


జమాతే ప్రభుత్వం ఏర్పడితే పాకిస్థాన్‌తో సన్నిహితంగా మెలగవచ్చని, ఇది హసీనా కాలానికి భిన్నంగా ఉంటుందని, ఆ సమయంలో భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక భాగస్వామిగా ఉండేదని అంటున్నారు. అయితే, జమాతే చీఫ్ మాత్రం తమ పార్టీ ఏ దేశానికీ మొగ్గు చూపదని, అందరితోనూ సత్సంబంధాలను కొనసాగిస్తామని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa