ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపుపై కాంగ్రెస్ నేత హర్షం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 06:08 AM

కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలతోనే తల పోట్లు కొత్తేమీ కాదు. జాతీయ స్థాయిలో శశిథరూర్ వంటి వారు కాంగ్రెస్ వ్యతిరేక గళం వినిపిస్తుండడం తెలిసిందే. రాష్ట్రాల స్థాయిలోనూ కొందరు కాంగ్రెస్ అసమ్మతివాదులు ఉన్నారు. అలాంటివారిలో తమిళనాడు నేత ప్రవీణ్ చక్రవర్తి ఒకరు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ, దాదాపు ప్రతి విషయంలోనూ 'పార్టీ లైన్'కు ఆవలేఉంటారు. తాజాగా, విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయిస్తే.ఈయన హర్షం వ్యక్తం చేశారు. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉండగా... డీఎంకే వ్యతిరేకి అయిన విజయ్ కు ప్రవీణ్ చక్రవర్తి మద్దతు పలకడడం తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడడంలేదు. అధికార డీఎంకే కూటమితోనే కలిసి ప్రయాణించాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆయన మాత్రం నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీకి అనుకూలంగా సంకేతాలు పంపుతూ కలకలం రేపుతున్నారు.నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’  పార్టీకి 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ‘విజిల్’ గుర్తును కేటాయించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే టీవీకే మద్దతుదారులతో కలిసి ప్రవీణ్ చక్రవర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "2026 తమిళనాడు ఎన్నికలకు విజిల్ ఊదేశారు. అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి" అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చర్చనీయాంశంగా మారాయి.డీఎంకే ప్రభుత్వం, సీఎం స్టాలిన్‌పై విజయ్ విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రవీణ్ ఆయనకు మద్దతుగా నిలవడం ఇది తొలిసారి కాదు. ఇటీవల చెన్నైలోని టీవీకే కార్యాలయంలో విజయ్‌తో ప్రవీణ్ చక్రవర్తి ఏకాంతంగా సమావేశం కావడం రాజకీయంగా ఊహాగానాలకు తెరలేపింది. పొత్తుల విషయంలో గందరగోళం సృష్టించవద్దని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పెద్దలు స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ వివాదంపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కే. సెల్వపెరుంతగై స్పందిస్తూ, పార్టీ పూర్తిగా ఏఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉందని, పొత్తుల విషయంలో అనవసర గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఈ విజిల్ గుర్తును గతంలో 2019లో కర్ణాటకలో ప్రకాశ్ రాజ్, 2021లో తమిళనాడులో నటుడు మయిల్ సామి స్వతంత్ర అభ్యర్థులుగా ఉపయోగించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa