ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా మారడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 09:35 PM

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పారిశ్రామిక విధానంలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నుంచి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' వైపు అడుగులు వేస్తున్నామని, పెట్టుబడులను వారాల వ్యవధిలోనే కార్యరూపంలోకి తెచ్చేలా 2035 నాటికి రాష్ట్రాన్ని 'డే-జీరో రెడీ స్టేట్'గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నమ్మకం, వేగం అనే రెండు అంశాలు ఏపీని కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.దావోస్‌లో జరిగిన 'ద ఫాస్ట్ లేన్: ఇన్వెస్టింగ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్' అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి సమయం ఆదా చేయడమే అతిపెద్ద లాభం. ఇదే రాష్ట్రానికి ఆర్థిక పోటీలో ఆధిక్యతను ఇస్తోంది. దీనికోసం రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి  ప్రతినెలా సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు, అంతర్గత సమస్యలను పరిష్కరిస్తోంది. భూమి, యుటిలిటీస్, పర్యావరణ అనుమతుల వంటి అంశాల్లో వరుస అనుమతులకు బదులుగా ప్యారలల్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రాజెక్టులు ప్రారంభించే సమయాన్ని గణనీయంగా తగ్గించాం" అని వివరించారు.2035 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 'డే-జీరో రెడీ స్టేట్'గా గుర్తింపు పొందేలా చేయడమే తమ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. అంటే, పెట్టుబడి నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల్లోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిర్ణయాలు వ్యక్తుల ఇష్టానుసారం కాకుండా, పటిష్టమైన వ్యవస్థ ఆధారంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. రియల్ టైం డేటాతో పనిచేసే యూనిఫైడ్ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా జాప్యాన్ని ముందుగానే గుర్తించి, అవరోధాలను తొలగిస్తున్నామని వివరించారు.పరిపాలనలో వేగాన్ని పెంచేందుకు డీ-రెగ్యులేషన్ డ్రైవ్‌లో భాగంగా గత 18 నెలల్లో 50కి పైగా సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నాలా చట్టాన్ని రద్దు చేశామని, డీ-క్రిమినలైజేషన్ దిశగా మరిన్ని చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. తాము రిస్క్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరిస్తున్నామని, తక్కువ రిస్క్ ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇస్తూ, అధిక ప్రభావం చూపే ప్రాజెక్టుల విషయంలో లోతైన పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఇది సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని కొన్ని నగరాలకే పరిమితం చేయకుండా, అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధి ద్వారా ఉద్యోగాలు, ఆదాయం, సంపద సమానంగా పంపిణీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పార్కును స్థానిక వనరుల ఆధారంగా, అగ్రో-ప్రాసెసింగ్, సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల కోసం ప్రత్యేక క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇది వలసలను తగ్గించడంతో పాటు, పెద్ద పరిశ్రమలకు సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడమే ఏపీ ప్రత్యేకత అని లోకేశ్ అన్నారు. విధానాల స్థిరత్వం, సంస్థల విశ్వసనీయతతో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. నమ్మకం, వేగం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పోటీ వాతావరణంలో ఒక ప్రత్యేక పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కెర్నీ సీనియర్ పార్టనర్ సుకేతు గాంధీ, గూగుల్ ఏసియా-పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, కాగ్నిజెంట్ గ్లోబల్ సీఎఫ్ఓ జతిన్ దలాల్, రెన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa