ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరైన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:44 PM

టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, పేదలకు అండగా నిలిచేందుకు మా ప్రభుత్వం తరఫున శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో బ్యాంకర్లు కూడా ఉదారంగా వ్యవహరించి మాకు సహకరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకు బ్యాంకులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నేరుగా సచివాలయంలో జరిగిన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల  సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2025-26 వార్షిక రుణ ప్రణాళిక అమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాల తీరుతెన్నులపై సుదీర్ఘంగా సమీక్షించారు.రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బలోపేతం కావడం అత్యంత ఆవశ్యకమని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు.బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వీటిని ప్రోత్సహిస్తే ప్రాథమిక రంగంతో పాటు పారిశ్రామిక, సేవా రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. పేద, ధనికుల మధ్య అంతరాలు తగ్గాలంటే బడుగు వర్గాలకు ఆర్థిక చేయూత అందాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు ఎంఎస్ఎంఈలకు రూ. 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, విచ్చలవిడిగా అప్పులు తేవడం వల్ల వడ్డీ భారం పెరిగిందని సీఎం గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం తమ ప్రభుత్వంపై ఉన్న క్రెడిబిలిటీ కారణంగా తక్కువ వడ్డీలకే రుణాలు తెచ్చుకునే వెసులుబాటు కలిగిందన్నారు.క్రెడిబిలిటీ, బ్రాండింగ్‌కు మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ-షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రూ.49 వేల కోట్ల రుణాలను రీ-షెడ్యూల్ చేయడం ద్వారా రూ.1108 కోట్ల మేర ఆదా చేసుకోగలిగాం అని సీఎం వివరించారు. ప్రజలకు భరోసా ఇచ్చేలా పాలన సాగుతోందని, బ్యాంకర్లు కూడా అదే నమ్మకంతో ముందుకెళ్లాలని సూచించారు.వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 2.96 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. అయితే, కౌలు రైతులకు, ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని సీఎం కోరారు.డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను  తీర్చిదిద్దాలి. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పరిస్థితి రాకూడదు అని సీఎం స్పష్టం చేశారు. అలాగే, డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ ఖాతాలపై ప్రస్తుతం 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని, వీటిని తగ్గించి మహిళలకు ఊరట కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు.రాష్ట్రంలో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు బ్యాంకులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రధాన హబ్‌కు యూనియన్ బ్యాంక్, రాజమండ్రికి ఎస్బీఐ, అనంతపురానికి కెనరా బ్యాంక్, విశాఖకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, తిరుపతికి ఇండియన్ బ్యాంక్, విజయవాడకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సహకారం అందిస్తున్నాయని బ్యాంకర్లు తెలిపారు. లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తున్న యూనియన్ బ్యాంక్, తన సీఎస్సార్ నిధుల నుంచి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 10 కోట్లు విరాళం ప్రకటించింది.అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మార్చేందుకు బ్యాంకులు తమ కార్యాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం కోరారు. భూ రికార్డుల ప్రక్షాళన, క్యూఆర్ కోడ్ ఆధారిత పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను వివరించిన సీఎం, బ్యాంకులు కూడా ఖాతాల నిర్వహణలో క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ఇకపై జరిగే ఎస్ఎల్బీసీ సమావేశాలకు జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa