పార్లమెంట్ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య బుధవారం ఉదయం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సెషన్ ప్రారంభానికి ముందు.. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి వెళ్తుండగా.. ‘మిత్రద్రోహి వెళ్తున్నాడు.. ఆయనను చూడండి’ అంటూ అతడితో రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. దీనికి నిరాకరించడంతో ‘హలో సోదరా.. బాధపడకు.. నువ్వు ఎప్పటికైన తిరిగి వస్తావు (కాంగ్రెస్లోకి)’ అంటూ చమత్కరించారు.
ఈ వ్యాఖ్యలపై బిట్టూ స్పందిస్తూ.. ‘నువ్వు దేశ ద్రోహివి’ అంటూ రాహుల్పై మండిపడ్డారు. దీంతో ఇరువురి మధ్య చిన్న వాగ్వాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలను రాహుల్ సమర్థించుకున్నారు. నిరసన తెలుపుతున్న ఎంపీల గురించి ‘వారు యుద్ధంలో గెలిచినట్లు కూర్చున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ వాగ్వాదం జరిగింది.
రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ముందుకొచ్చినప్పుడు తాను ఎందుకు నిరాకరించానో బిట్టు వివరిస్తూ.. 1984లో స్వర్ణ దేవాలయంలో మిలిటెంట్లను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్, సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
‘వాళ్లు దేశద్రోహులు, దేశానికి శత్రువులు, ప్రతిరోజూ సైన్యం గురించి, దేశం గురించి చెడుగా మాట్లాడుతారు. సిక్కుల హంతకులైన గాంధీ కుటుంబ వారసుడితో ఒక సర్దార్ ఎప్పటికీ కరచాలనం చేయడు’ అని బిట్టు అన్నారు. కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఢిల్లీ మంత్రి మంజీదర్ సింగ్ సిర్సా ఖండించారు. ‘రాహుల్ గాంధీ, అతడి కుటుంబం ద్రోహులు.. సిక్కులు, సర్దార్లు కాదు.. ఆయన వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ మనస్తత్వం ఏమాత్రం మారలేదని అర్ధమవుతోంది’ అని విమర్శించారు.
అటు, రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ‘ద్రోహి’కి అంతకంటే సరైన పదం మరొకటి లేదని వాదించింది. "ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వకపోతే మేము ఏం చేయగలం? బిట్టును ఎంపీగా ఎవరు చేశారు? ఒక ద్రోహి గురించి మనం ఇంకేం చెప్పగలం?’ అని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ రాజా వారింగ్ అన్నారు.
రవ్నీత్ సింగ్ బిట్టు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకుముందు మూడుసార్లు 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తమ సభ్యులను సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. హిబి ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మానికమ్ ఠాగోర్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, ప్రశాంత్ యాదవరావ్ పడోలా, చామల కిరణ్ ఖుమార్ రెడ్డి, డీన్ కురియకొసే, సీపీఎం ఎంపీ ఎస్ వెంకటేశన్లను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa