తమ రాష్ట్రంలో జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్‌లో 58 లక్షల ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ కేసులో బుధవారం స్వయంగా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్‌కు వెళ్లిన దీదీ.. తన వాదనలు వినిపించడానికి ఐదు నిమిషాల సమయం కోరారు. దీనికి సీజేఐ అంగీకరిస్తూ.. 15 నిమిషాలు తీసుకోండని చెప్పారు.
న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోందని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్.. సమస్య ఏమిటంటే... చివరికి మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. నేను ఈసీఐకి ఆరుసార్లు లేఖలు రాశాను.. అయినా ఇప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదు. న్యాయం మూసిన తలుపుల వెనుక రోదిస్తోంది’ అంటూ ముఖ్యమంత్రి తన వాదనలను ప్రారంభించారు. దీంతో ఈ అంశం ఎన్నికల కమిషన్‌పై పూర్తిస్థాయి దాడిగా మారింది. మమతా బెనర్జీ అభ్యర్థన నిజమైనదని ధర్మాసనం అంగీకరించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. బెంగాల్ సీఎం పిటిషన్‌పై ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసు కూడా జారీ చేసింది.
ఇక, సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్లతో మమతా బెనర్జీ సమావేశమైన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో పేర్లు తొలగించిన బాధితులు కొందర్ని ఆమె ఈ భేటీకి తీసుకొచ్చారు. అయితే, ఈసీ తీరును ఆక్షేపిస్తూ సమావేశం నుంచి మధ్యలోనే ఆమె బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, లక్షల మందిని ఢిల్లీకి తీసుకొస్తానని ఈసీని హెచ్చరించారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. అంతేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో ఎందుకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టలేదని దీదీ ప్రశ్నించారు. బెంగాల్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa