ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో 100 'రిలయన్స్' కంపెనీలొస్తాయ్.. ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు

business |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 11:00 PM

సాధారణంగా భారతీయులు తమ సంపాదనను నగదు రూపంలోనో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఈ సంప్రదాయ పొదుపు పద్ధతులకు స్వస్తి పలికి, డిజిటల్ ఆర్థిక సేవల ద్వారా ప్రతి సామాన్యుడిని ఇన్వెస్టర్‌గా మార్చడమే తమ ఉద్దేశమని అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయితే 'బ్లాక్‌రాక్'తో కలిసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భారత్ లో సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ విప్లవాన్ని తీసుకురాబోతోందని చెప్పారు. దేశీయ ఆర్థిక రంగంల మరో విప్లవాత్మక మార్పునకు జియో బ్లాక్ రాక్ నాంది పలికిందన్నారు. భారతీయులు దశాబ్దాలుగా చేస్తున్న సంప్రదాయ పొదుపు అలవాటును మార్చి పెట్టుబడుల వైపు మళ్లిచడం, దీర్ఘకాలిక ఆదాయంగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.


ముంబైలో బుధవారం జియో బ్లాక్ రాక్ ఫైర్ సైడ్ కార్యక్రమంలో బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో భారతీయుల దశాబ్దాల సంప్రదాయాన్ని మార్చుతామని తెలిపారు. భారతీయుల వద్ద ఉన్న డెడ్ క్యాపిటల్‌ను ఉత్పాదక మూలధనంగా మార్చడమే ఈ జాయింట్ వెంచర్ జియోబ్లాక్‌రాక్ ఉద్దేశమని తెలిపారు. దీనివల్ల సామాన్యులకు కూడా స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడి సాధానాల ద్వారా దీర్ఘకాలికంగా సంపదను సృష్టించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రపంచ స్థాయి పెట్టుబడి నైపుణ్యం గల బ్లాక్ రాక్ అనుభవం, జియోకు ఉన్న విస్తృతమైన డిజిటల్ నెట్‌వర్క్ కలిపి తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.


 'దేశంలో ఇంటర్నెట్ డేటా ఎలాగైతే చాలా చౌకగా అందరికీ అందుబాటులోకి వచ్చిందో అదే మాదిరిగా ఆర్థిక సేవలను సైతం సులభతరం చేసి ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం ఆర్థిక స్వాతంత్య్ర పొందేలా చేస్తాం. ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే సెకన్లలో పెట్టుబడి పెట్టేలా జియో బ్లాక్ రాక్ వేదికను సిద్ధం చేస్తోంది.' అని తెలిపారు.


ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ముకేశ్ అంబానీ ప్రశంసలు కురిపించారు. పీఎం మోదీ నాయత్వంలో దేశం ఆర్థిక వృద్ధిలో మరింత ముందుకు వెళ్తోందన్నారు. గత 20 ఏళ్లుగా దేశంలో శాంతి భద్రతలు స్థిరంగా ఉన్నాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల వృద్ధి వల్ల స్టార్టప్ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ వృద్ధి ఇలాగే కొనసాగినట్లయితే భవిష్యత్తులో రిలయన్స్ వంటి 100 కంపెనీలు వస్తాయన్నారు. జియోబ్లాక్ రాక్ కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. దేశానికి స్థిరమైన రెండంకెల వృద్ధి సాధ్యమేనని తెలిపారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఇంధన రంగంలో దిగుమతులను 80 శాతానికి తగ్గించుకుంటుందని అంచనా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa