ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు.నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.పవన్ కల్యాణ్ తన ఆరోపణలకు సంబంధించిన గణాంకాలను కూడా మీడియా ముందుంచారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ నిర్దిష్ట కంపెనీ 59.70 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసినట్లు అధికారికంగా లెక్కలు చూపింది. కానీ, మా వద్ద ఉన్న ఆధారాల ప్రకారం, అదే కంపెనీ 58 లక్షల కిలోలకు పైగా పామాయిల్, దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అంతేకాకుండా, సుమారు 1.70 లక్షల నుంచి 2 లక్షల కిలోల వరకు రసాయనాలను కూడా కొనుగోలు చేసినట్లు ఆన్ రికార్డ్ ఆధారాలున్నాయి. నెయ్యి సరఫరా చేస్తున్నామని చెప్పి, పామాయిల్, రసాయనాలు కొనుగోలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి ఇది కల్తీ నెయ్యి కాదు, కల్తీ వనస్పతి, కల్తీ పామాయిల్" అని పవన్ వివరించారు. ఈ కుంభకోణం కేవలం తిరుమలతోనే ఆగిపోలేదని, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి కూడా ఇక్కడి నుంచి పంపిన లక్ష లడ్డూలు సైతం ఈ కల్తీ నెయ్యితో తయారు చేసినవేనని పవన్ ఆరోపించారు. దేశమంతా ఎంతో పవిత్రంగా జరుపుకున్న కార్యక్రమానికి సైతం కల్తీ లడ్డూలు పంపి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆయన మండిపడ్డారు.గత ప్రభుత్వానికి దేవుడిపై, హిందూ సంప్రదాయాలపై పగ ఉందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని పవన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.వీరికి ఏడుకొండల స్వామిపై ఎందుకో పగ. ఏడు కొండలు ఎందుకు, రెండు చాలు అన్న చరిత్ర వీరిది. వీరు వ్యక్తులపై, ప్రత్యర్థులపై కాదు, ఏకంగా భగవంతుడిపైనే పగబట్టారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారి వారసత్వం, వారి పరంపర ఎలాంటిదో ప్రజలు గమనించాలి. అందుకే ఈ అంశాన్ని సరిదిద్ది, వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. గత ఐదేళ్లలో, అంటే 2019 నుంచి 2024 వరకు, రాష్ట్రంలో వైసీపీ పాలనలో హిందూ ధర్మానికి, దేవాలయాలకు తీరని అపచారాలు జరిగాయి. ఇవి చాలా సున్నితమైన అంశాలు. మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న విషయాలపై ఆనాటి ప్రభుత్వ పెద్దలు చూపిన నిర్లక్ష్యం, వారి బాధ్యతారాహిత్యం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి.ఉదాహరణకు, రామతీర్థంలో సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ శిరచ్ఛేదనం జరిగితే, దాన్ని ఎవరో ఆకతాయి చేసిన పనిగా తేల్చేశారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అశుద్ధం పూస్తే, దానిని ఎవరో పిచ్చోడి చర్యగా చిత్రీకరించి చేతులు దులుపుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో వెండి సింహాలు మాయమైతే, 'అవి పోతే ఇంకొకటి కొంటాం, వాటితో ఏమైనా మేడలు, మిద్దెలు కడతామా?' అని అప్పటి మంత్రులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదు. ఇక అంతర్వేదిలో పవిత్రమైన రథం కాలిపోతే, దాన్ని మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనిగా తేల్చేసి కేసును పక్కన పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా, ఆనాటి ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధ్యతగా మాట్లాడటం గానీ, కఠిన చర్యలు తీసుకోవడం గానీ చేయలేదు.మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇలాంటి పాత విషయాలపై ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం మాకేముంటుంది మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాం. జరిగిన వాస్తవాలు మాకు తెలిసి కూడా ప్రజలకు చెప్పకపోతే, భవిష్యత్తులో వారే మమ్మల్ని నిలదీస్తారు, 'మీకు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నార అని అడుగుతారు. అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాం.గత ఐదేళ్లలో హైందవ సంస్కృతి, మన ధర్మంపై వైసీపీ ప్రభుత్వం తరచుగా దాడులకు, అపవిత్ర కార్యాలకు తెగబడింది. అందుకే దీనిపై మాట్లాడాల్సిన, ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఎదురు మాపైనే విమర్శలు చేస్తున్నారు. ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను.భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు. చరిత్రలో అలా బతికి బట్ట కట్టిన దాఖలాలు కూడా లేవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి" అని పవన్ తీవ్ర హెచ్చరికలు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa