ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్ఘనిస్తాన్‌‌పై కివీస్ ఘన విజయం,,,,,హాఫ్ సెంచరీతో రాణించిన టిమ్ సైఫర్ట్

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 10:47 PM

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ డీలోని న్యూజిలాండ్ - అప్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటీపోటీగా తలపడ్డాయి. అప్ఘనిస్తాన్ ఇచ్చిన భారీ స్కోర్‌ను న్యూజిలాండ్ జట్టు అవలీలగా ఛేజ్ చేసి విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్ట్ అద్భుత ప్రదర్శనతో కివీస్ విజయం సాధించగలిగింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ఉదయం కావడంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుల్బదీన్ నాయబ్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో దర్వీష్ రసూలీ 20 పరుగులు చేయడంతో అప్ఘన్లు భారీ స్కోర్ చేయగలిగారు.


భారీ స్కోర్ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్‌ను ముజీబ్ అర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేయగా, ఆ తర్వాతి బంతికే రచిన్ రవీంద్రను కూడా బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు రెండో ఓవర్‌కే కేవలం 14 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.


సరిగ్గా అదే సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి ఓపెనర్ టిమ్ సైఫర్ట్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 42 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సైఫర్ట్ - ఛాప్‌మన్ ఇద్దరూ కలిసి మళ్లీ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.


కివీస్ విజయానికి దగ్గరగా ఉంది అనుకున్న సమయంలో టిమ్ సైఫర్ట్ అవుటయ్యాడు. 42 బంతులు ఆడిన సైఫర్ట్ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి అవుటయ్యాడు. ఛాప్‌మన్ కూడా 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరుగులు చేశాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ వరుస బౌండరీలు బాదడంతో న్యూజిలాండ్‌కు ఈజీ విక్టరీ దక్కింది. మిచెల్ 14 బంతుల్లో 25, సాంట్నర్ 8 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ని మరో రెండు ఓవర్లు ఉండగానే ముగించారు. 17.5 ఓవర్లలోనే 183 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్న కివీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa