మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మహాశివరాత్రి నేపథ్యంలో ఆదివారం నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో మల్లన్న దర్శనం కోసం సాధారణ భక్తులు, శివస్వాములు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున శ్రీశైలం ఆలయంలో శివభక్తులు నిరసనకు దిగారు. స్పర్శ దర్శనానికి ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ శివస్వాములు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే కృష్ణదేవరాయ క్యూలైన్లు విరగ్గొట్టి కొంతమంది ముందుకు చొచ్చుకెళ్లారు. శ్రీశైలం పుష్కరిణి వైపున ఉన్న గేట్లు ఎక్కి దేవాలయంలోకి వస్తున్నారు. మరోవైపు శివస్వాములను కట్టడి చేయలేక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు దేవస్థానం ఏర్పాట్లు, దర్శనం విధానాలపై శివస్వాములు మండిపడుతున్నారు. వీఐపీ దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించడంతో క్యూలైన్లలోనే ఆందోళన చేపట్టారు. భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోవటంతో ఈవో డౌన్ డౌన్ అంటూ నినదించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోలేదని.. ఏర్పాట్లు సరిగా చేపట్టలేదని మండిపడ్డారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలోనే వేచి ఉండాల్సి వస్తోందని.. కనీసం మంచినీరు కూడా అందించలేదని కొంతమంది ఆరోపించారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ క్యూలైన్ల గేట్లు ధ్వంసం చేసి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు 500 రూపాయల దర్శనం టికెట్ కొన్న భక్తులు కూడా ఆలయ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలిరావటంతో శ్రీశైలం ఘాట్ రోడ్లలోనూ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. దర్శనాల కోసం సొంత వాహనాలలో ఎక్కువ మంది వస్తుండటంతో వాహనాల రాకపోకలు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 18వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. శివదీక్ష తీసుకున్న శివస్వాములకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ శ్రీశైలంలో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. అయితే వీఐపీ దర్శనాల కారణంగా స్పర్శ దర్శనం కల్పించడం లేదని శివస్వాములు.. మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని సాధారణ భక్తులు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa