ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఫ్లాట్‌ను 25 మందికి అమ్మేసి.. రూ.500 కోట్లు దోచేసి

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 09:02 PM

బంగారం, భూములపై పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. చేతిలో డబ్బులు ఉన్నాయంటే చాలు ఎక్కువ మంది వీటి రెండింటి కొనుగోలుపైనే దృష్టి పెడతారు. ఈ ఆలోచననే ఆయుధంగా మలుచుకున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి.. రూ.500 కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా ఒకటే ఫ్లాట్‌ను మొత్తంగా 25 మందికి విక్రయించి రెండేళ్లలోనే కోట్లు కొల్లగొట్టాడు. కానీ నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో.. ఈ బాగోతం బట్టబయలు అయింది.


అసలేం జరిగిందంటే..?


ప్రముఖ నివాస మరియు వాణిజ్య సముదాయం '32nd Avenue' (గతంలో 32 Milestone) సీఈఓ ధ్రువ్‌దత్.. ఈ మోసానికి పాల్పడ్డారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-15లోని 32 మైల్‌స్టోన్ భవనంలోని మొదటి అంతస్తులోని 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఓ ఫ్లాట్‌ను నిందితుడు ధ్రువ్‌దత్ శర్మ తన సహచరులతో కలిసి అనేక మందికి అమ్మేయడం ప్రారంభించాడు. అయితే మొదటగా 2021లో 'ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ.. దీన్ని కొనుగోలు చేసింది. ఈ ఆసక్తి కోసం రూ.2.5 కోట్లు కూడా చెల్లించింది. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ.. ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయకుండా శర్మ కాలయాపన చేశాడు. ప్రతీసారి ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు.


 దీంతో సదరు సంస్థ తన ప్రతినిధి అప్రా మోటెల్స్‌ని రంగంలోకి దింపింది. అతడు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదనే విషయంపై ఆరా తీయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అదే ఫ్లాట్‌ను 2022, 2023 సంవత్సరాల్లో మరో 25 మందికి అమ్మేసినట్లు వెల్లడి అయింది. దీంతో షాకైన ప్రతినిధి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈ భారీ మోసంపై ఆర్థిక నేరాల విభాగం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించిన పోలీసులు.. నిందితుడు ధ్రువ్‌దత్ శర్మ సివిల్ లైన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు గుర్తించారు.


శుక్రవారం నాడు గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోసీలులు అతడిని విచారించగా.. చేసిన తప్పును శర్మ ఒప్పుకున్నాడు. తక్కువ స్థలాన్ని ఎక్కువ మందికి చూపించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా.. తన సొంత సంస్థ 'గ్రోత్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా ఆ యూనిట్లను తిరిగి లీజుకు ఇచ్చి మరింత ఎక్కువ డబ్బును దండుకున్నట్లు విచారణలో తేలింది.


కస్టడీలోకి నిందితుడు..


పోలీసులు నిందితుడిని ఫిబ్రవరి 6న కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ భారీ స్కామ్‌లో శర్మతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? దండుకున్న రూ. 500 కోట్లను ఎక్కడ దాచారు? అనే విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా ఇంకా ఎంతమంది బాధితులు ఇలాంటి మోసానికి గురయ్యారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేముందు ఆస్తుల పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa