షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు. అఫ్గనిస్థాన్ విషయంలో మన విధానం దశాబ్దాలుగా ఎందుకు దారుణంగా విఫలమైందని జమాయిత్ ఉలేమియా ఇస్లామ్ (ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ప్రశ్నించారు. ఒక దానిమ్మ లేదా పుచ్చకాయ దేశంలోకి ప్రవేశించిలేదు కానీ, ఉగ్రవాదులు మాత్రం సరిహద్దులు దాటుతూనే ఉన్నారని, సైన్యం ఏం చేస్తుందని ఆయన నిలదీశారు. ఆదివారం రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఫజ్లూర్ రెహమాన్ మాట్లాడుతూ... అఫ్గనిస్థాన్ నుంచి వాణిజ్యం నిలిచిపోయినప్పటికీ తీవ్రవాదులు మాత్రం వస్తూనే ఉన్నారనే వైరుధ్యాన్ని ఎత్తి చూపారు. కాగా, అఫ్గన్‌పై వైమానిక దాడులను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. అలా అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సరైందేనని గతంలో అన్నారు.
‘‘దశాబ్దాలుగా మన ఆఫ్ఘన్ విధానం ఎందుకు ఇంత దారుణంగా విఫలమైంది.. ఒక్క దానిమ్మ లేదా పుచ్చకాయ కూడా పాకిస్థాన్‌లోకి ప్రవేశించలేదు అయినప్పటికీ ఉగ్రవాదులు సరిహద్దు దాటుతూనే ఉన్నారు’’ అని అన్నారు. ‘‘ఉగ్రవాదులు అక్కడ (అఫ్గనిస్థాన్) నుంచి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.. వాళ్లు వస్తే అడ్డుకోవాలి.. వచ్చినవాళ్లను అంతం చేయాలి.. అఫ్గన్ ప్రభుత్వ మీ చర్యలపై ఎఫ్పుడూ అభ్యంతరం తెలపలేదు’’ చెప్పారు. పాకిస్థాన్ విదేశాంగ, ఆర్థిక విధానాలు పూర్తి విఫలమయ్యాయని రెహమాన్ విమర్శించారు.
‘‘మన విధానాలు విఫలమయ్యాయి.. భారత్ మన శత్రువు.. అఫ్గనిస్థాన్ మన శత్రువు.. ఇరాన్, చైనాలు మనపై కోపంగా ఉన్నాయి.. పాకిస్థాన్ ప్రజలకు సమాధానాలు తెలుసుకునే హక్కు ఉంది.. ఒక దేశం విధానాలు కేవలం ఏకాకితం, అపనమ్మకం, అభద్రతను మాత్రమే సృష్టిస్తే, ఆ దేశం మనుగడ సాగించలేదు’‘ అని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాదు, మన విదేశాంగ విధానం ప్రజా ప్రభుత్వం ద్వారా కాకుండా సైనిక వ్యవస్థతో రూపొందుతుందని విమర్శించారు. ఓ జనరల్ వచ్చి మేము చర్చలు జరుపుతామని అంటారు.. మరో జనరల్ వచ్చి యుద్ధం చేస్తామని అంటారు’’ అని ఫజ్లూర్ రెహమాన్ అన్నారు.
చైనాకు నమ్మకం లేదు
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సిపెక్) నిర్వహణ విషయంలోనూ ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తిపోశారు. మన ప్రభుత్వంపై చైనాకు విశ్వాసం సన్నగిల్లడం వల్ల ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వ హయాంలో సిపెక్ ప్రాజెక్టులో ఎలాంటి నిజమైన పురోగతి లేదు.. ఎందుకంటే చైనాకు ఇకపై మాపై నమ్మకం లేదు’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో సీపెక్ ప్రాజెక్ట్ నిలిచిపోయినప్పుడు.. బీజింగ్, ఇస్లామాబాద్‌లకు సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు; కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా భిన్నంగా ఉందా? అని ఆయన నిలదీశారు. ‘‘ఈ రోజు నేను అడుగుతున్నా.. ఈ ప్రభుత్వం హయాంలో ఒక్క ఇటుక అయినా ముందుకు కదిలిందా?’ అని ఆయన అన్నారు. పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ ప్రభుత్వం ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించి, సీపెక్ ప్రాజెక్ట్‌ను మెరుగుపరుస్తుందని చైనా ఆశించిందని రెహమాన్ అన్నారు. దీనికి బదులుగా చైనా పాకిస్థాన్ పట్ల అసంతృప్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa