ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కల గురించి మాట్లాడతారు, పిల్లల గురించి మాట్లాడరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 09:36 PM

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వీధి కుక్కల సంరక్షణ అంశం హాట్‌టాపిక్ అయ్యింది. కొందరు సెలబ్రిటీలు వీధి కుక్కల్ని సంరక్షించాలని బాధ్యత ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం వీధి కుక్కలు మనుషుల, పిల్లలపై దాడి చేస్తుంటే వాటిని ఎలా సంరక్షిస్తారని ప్రశ్నిస్తున్నారు. శునకాల గురించి డిబేట్ జరుగుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ట్వీట్ హాట్‌టాపిక్ అయ్యింది. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడే సెలబ్రిటీలు.. గిరిజన బిడ్డల గురించి ఎందుకు మాట్లాడం లేదు అంటూ ట్వీట్ చేశారు.


'కుక్కల సంరక్షణపై మాట్లాడడానికి మనకు ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు.. కానీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం దౌర్భాగ్యం!. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ , నిల్వ చట్నీ.. 89 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 70 మందికి చికిత్స.. ఒకే మంచంపై నలుగురైదుగురికి సెలైన్లు. ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతున్నా.. తీరు మారని బాబు సర్కారు.. గిరిజన విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం. కూటమి అధికారం చేపట్టాక ఏపీలో ఇప్పటివరకు సరైన ఆహారం , మంచినీరు , వైద్యం లేక.. 50 మంది వరకు మరణించారు.. వందలమంది అనారోగ్యం బారిన పడ్డారు. దీనిపై ఏ మీడియాలోనూ చర్చలు జరగవు.. ఏ మేధావులూ మాట్లాడరు. కుక్కల సంరక్షణపై మాట్లాడడానికి మనకు ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు.. కానీ గిరిజన బిడ్డల గురించి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం దౌర్భాగ్యం' అంటూ ట్వీట్ చేశారు.


వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిది ఆరె శ్యామల ట్వీట్ పరోక్షంగా.. సినీ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూదేశాయ్‌ కుక్కల సంరక్షణ గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించారా అనే చర్చ జరుగుతోంది. కుక్కల్ని సంరక్షించాలని బలంగా వాయిస్ వినిపిస్తున్న వాళ్లు గిరిజన పిల్లలు, వారి సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని శ్యామల ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల్ని చంపడంపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. తాను ఎప్పుడూ వ్యక్తిగత హక్కుల కోసం పోరాటం చేయలేదన.. కానీ కుక్కల విషయంలో మాత్రం తన పోరాటం ఆగదు అన్నారు. ఎక్కడో ఒకటి, రెండు చోట్ల జరిగిన ఘటనలతో కుక్కల్ని చంపాలనడం సరికాదన్నారు.


పోలవరం జిల్లా దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్ అయ్యింది. శనివారం రోజు ఇడ్లీలు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు.. వెంటనే మొత్తం 89మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరు కోలుకోవడంతో తిరిగి స్కూల్‌కు పంపించారు.. మిగిలినవారు ఆస్పత్రిలో ఉన్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి ఇడ్లీ రవ్వ, శనగపిండి కారణమి తేల్చారు.. గడువు ముగిసిన వాటితో ఫుడ్ తయారు చేయడమే కారణం అంటున్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ వార్డెన్, వంటమనిషిని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు.. విచారణ జరుగుతోంది. మరోవైపు దేవరపల్లి స్కూల్‌లో విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి.. తనకు నివేదించాలని ఆదేశించారు. అధికారులు పరిస్థితిని సీఎంకు వివరించారు. ఆరె శ్యామల కూడా ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa