ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభలో.. స్పీకర్‌ ఓం బిర్లాపైనే అవిశ్వాస తీర్మానం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 08:26 PM

దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాల వేడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్‌సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు విపక్ష 'ఇండియా' కూటమి గట్టిగా యోచిస్తోంది. పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్‌పైనే ఇలాంటి తీర్మానం తీసుకురావాలని చూడటం అత్యంత అరుదైన పరిణామం కాగా .. అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.


విపక్షాల ప్రధాన ఆరోపణలు ఇవే..


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ) వంటి ప్రధాన పక్షాలు పాల్గొన్నాయి. అయితే విపక్షాలు స్పీకర్‌పై మండిపడటానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా స్పీకర్ అడ్డుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీలు, మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు రాజ్యసభలో ప్రసంగించే అవకాశం దక్కక పోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు లోక్‌ సభలోనూ విపక్షాల నిరసనలతో సభా కార్యకలాపాలు పదేపదే స్తంభించాయి.


అవిశ్వాస తీర్మానం నిబంధనలు ఏమిటి?


రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c) ప్రకారం స్పీకర్‌ను తొలగించేందుకు తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. దీని కోసం కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలంటే కనీసం 50 నుంచి 100 మంది ఎంపీల మద్దతు లేదా సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. "మా తదుపరి చర్యల కోసం వేచి చూడండి" అంటూ పరోక్షంగా ఈ వార్తను ధృవీకరించారు.


ఒకవేళ తీర్మానం అమల్లోకి వస్తే..?


ఒకవేళ ఈ తీర్మానం అమల్లోకి వస్తే.. అది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నైతిక సంకటంగా మారుతుంది. అయితే లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. రాజకీయంగా స్పీకర్ స్థానాన్ని వివాదాల్లోకి నెట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విపక్షాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa