ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో వ్యాపారి కొడుకు పేరు మిస్!

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 08:21 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో లంబోర్గిని ప్రమాదం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రమాదం వేళ 4018 నెంబరు ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా, ఈ ప్రమాదం గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు మద్యం మత్తులో కారు నడిపి.. పాదచారులపై దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే, అతడి పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ నుంచి అతడి పేరు మిస్సయ్యిందంటూ మీడియా కథనాలు వెలువరించింది. ప్రమాదం తర్వాత మిశ్రా కుమారుడు శివమ్‌ను కారు నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అతడి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిందితుడు తండ్రి ప్రముఖ వ్యాపారి కావడం వల్లే అతడి కుమారుడ్ని రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్ వీఐపీ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలప్పుడు లంబోర్గిని రువ్యెల్టోను మద్యం మత్తులో అతివేగంగా నడుపుతూ బీభత్సం సృష్టించాడు. తొలుత ఆటోను ఢీకొట్టి, తర్వాత పలు వాహనాలపై కారు దూసుకెళ్లడంతో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఢీకొట్టడంతో బండి నడుపుతున్న వ్యక్తిని 10 అడుగుల వరకు ఈడ్చుకెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది.


ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు.. కారును జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి. . కవర్లు కప్పి భద్రపరిచినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పొగాకు వ్యాపారి కుమారుడు శివం మిశ్రా పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కారును ఆపాల్సింది పోయి ఘటనా స్థలి నుంచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. వెనుకాలే మరో కారులో వస్తున్న అతడి బౌన్సర్లు అతడ్ని రక్షించడానికి ప్రయత్నించినా కానీ ప్రయోజనం లేకపోయింది. వారు స్థానికులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ప్రమాదానికి గురైన రూ. 10 కోట్ల విలువైన లంబోర్గిని నంబర్ ప్లేట్‌పై '4018' అని ఉండటం వైరల్ అవుతోంది. కాగా, గతంలో పుణేలోనూ ఇటువంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa