ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను సమూలంగా బలోపేతం చేసే లక్ష్యంతో పలు కీలక ప్రాజెక్టులు, కొత్త సర్వీసులు, మౌలిక వసతుల కల్పనపై ఆయనతో చర్చించారు. ఈ మేరకు సమగ్రమైన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. విజయవాడ-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా వెళ్లేలా వందేభారత్ రైలును కేటాయించాలని కోరారు.ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏపీని తాకుతూ ప్రకటించడంపై చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో, బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు మార్గాన్ని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతికి అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా కోరారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభించేలా తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే సరకు రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్‌పీటీ పోర్టుకు అరటిపండ్ల ఎగుమతికి వీలుగా, 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లను కేటాయించాలని కోరారు. అలాగే ఉత్తర-దక్షిణ భారతాలను కలిపే ఇటార్సీ-విజయవాడ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌కు, ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్‌పూర్-చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని ప్రతిపాదించారు.రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. హైదరాబాద్-శ్రీశైలం-మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా వందేభారత్ సర్వీసును నడపాలని చంద్రబాబు కోరారు. విశాఖ-విజయవాడ మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుప్పంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడంతో పాటు, అక్కడ రైలు బోగీల నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కూడా రైల్వే మంత్రిని కోరారు. సీఎం వినతులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు
సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa