వైసీపీ తీరుపై మంత్రి లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని, పెట్టుబడులను తరిమేయాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, అమర్ రాజా వంటి సంస్థను రాష్ట్రం నుంచి తరిమేశారని విమర్శించారు. తాము 17 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చామని, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో రాబోతోందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.నాపై విమర్శలు చేయాలనుకుంటే ఒక్క విషయంలో చేయవచ్చు. టాటా సన్స్ ఛైర్మన్‌ను కలిసినప్పుడు ఆయన బాంబే హౌస్‌లో ఒక కప్పు టీ ఇచ్చారు. దావోస్‌లో నా పుట్టినరోజున కాగ్నిజెంట్ వారు ఒక కేక్ ఇచ్చారు. అంతకుమించి మేం లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఒక కప్పు టీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకున్నట్లు నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధం" అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైసీపీకి సవాల్ విసిరారు. పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో ఎలాంటి అవినీతికి తావులేదని, తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యం యువతకు ఉద్యోగాలు కల్పించడమేనని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలకు ఆయన ఈ విధంగా ధీటుగా బదులిచ్చారు.శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పరిశ్రమలకు 99 పైసలకే భూముల కేటాయింపు అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. గత 20 నెలల్లో ప్రభుత్వం కేటాయించిన భూములు, కుదుర్చుకున్న ఒప్పందాలు వాటి ధరల వివరాలపై వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు ప్రశ్నలు లేవనెత్తారు. విశాఖలో కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు 99 పైసలకే ఎలా ఇస్తారని వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై మంత్రి లోకేశ్ సమగ్రంగా సమాధానమిచ్చారు.రాష్ట్రంలో కేవలం ఐదు విశ్వసనీయమైన కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు మాత్రమే ఈ ధరకు భూములు ఇచ్చామన్నారు. ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో సుమారు 65,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయని వివరించారు. ఉదాహరణకు, కాగ్నిజెంట్ మొదట 8,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, భూమిపూజ సమయంలో ఆ సంఖ్యను 25,000కు పెంచిందని గుర్తుచేశారు.విశాఖలో బలమైన ఐటీ ఎకోసిస్టమ్ లేదని, దాన్ని నిర్మించడానికే ప్రభుత్వం తక్కువ ధరకు భూములు కేటాయిస్తోందని లోకేశ్ వివరించారు. 1994-2004 మధ్య చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు తక్కువ ధరకే భూములు ఇవ్వడం వల్లే నేడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు. గుజరాత్‌లో టాటా నానో ఫ్యాక్టరీకి అప్పటి సీఎం నరేంద్ర మోదీ 99 పైసలకే భూమి ఇచ్చి మొత్తం ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో విశాఖను ఐటీ, జీసీసీ హబ్‌గా మార్చాలనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.చర్చ సందర్భంగా, అడ్రస్ లేని ఉర్సా కంపెనీకి ప్రభుత్వం భూములు కట్టబెట్టాలని చూస్తోందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణను మంత్రి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. తాము కేవలం ఐదు కంపెనీలకే 99 పైసలకు భూములు ఇచ్చామని, ఆరో కంపెనీ అయిన ఉర్సాకు భూములు కేటాయించినట్లు ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు, బొత్స సత్యనారాయణ నేతృత్వంలో నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ. తమ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. 2029 నాటికి ఒక్క విశాఖలోనే ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఒక ఐటీ ఉద్యోగం ద్వారా పరోక్షంగా మరో ఐదారుగురికి ఉపాధి లభిస్తుందని, దీనివల్ల విశాఖ ఆర్థిక వ్యవస్థకు ఏటా 10 బిలియన్ డాలర్ల మేర మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వానికి రెండు రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు కానీ, యువతకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.వైసీపీ సభ్యులు సత్యదూరమైన మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఛాలెంజ్ చేస్తే సమాధానం చెప్పలేక పారిపోవడం వారికి అలవాటేనని లోకేశ్ ఎద్దేవా చేశారు. భూముల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, అధికారుల కమిటీ, ఎస్ఐపీబీ, కేబినెట్ ఆమోదం తర్వాతే కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. క్లస్టర్ విధానంలో పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని, ప్రతి పరిశ్రమ గ్రౌండింగ్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa