ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి పరీక్షల్లో అదనపు సమాధాన పత్రాలను (Additional Answer Sheets) సరఫరా చేసే విధానానికి స్వస్తి పలకాలని బోర్డు నిర్ణయించింది. విద్యార్థులకు కేటాయించిన నిర్ణీత బుక్‌లెట్‌లోనే పూర్తి సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి, ప్రతి అంశాన్ని స్పష్టంగా, పొదుపుగా రాయడంపై విద్యార్థులు దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఫస్టియర్ విద్యార్థుల కోసం సబ్జెక్టుల వారీగా పేజీల సంఖ్యలో మార్పులు చేశారు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి కీలక సైన్స్ సబ్జెక్టులతో పాటు ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ పేపర్ల కోసం ప్రత్యేకంగా 32 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను అందజేయనున్నారు. ఈ ప్రధాన సబ్జెక్టులకు ఎక్కువ వివరణ అవసరమవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు తమ సమాధానాలను ఈ పరిమితి లోపే ముగించాల్సి ఉంటుంది.
మిగిలిన ఫస్టియర్ సబ్జెక్టులతో పాటు, పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పేపర్లకు మరియు సెకండియర్ విద్యార్థులందరికీ కేవలం 24 పేజీల బుక్‌లెట్‌ను మాత్రమే కేటాయించారు. సెకండియర్ పరీక్షలు రాసే వారు అన్ని సబ్జెక్టులకు ఈ 24 పేజీల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. గతంలో లాగా అదనపు పేజీలు అడిగే అవకాశం లేకపోవడంతో, విద్యార్థులు అనవసరమైన వివరణలు తగ్గించి మార్కులకు తగినట్లుగా సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
పరీక్షల సమయపాలనలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కొత్తగా ప్రవేశపెట్టిన బుక్‌లెట్ విధానంపై అవగాహన పెంచుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నిబంధనల వల్ల పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెరుగుతుందని, పేపర్ల మూల్యాంకనం కూడా సులభతరం అవుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa