ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో సంబంధాలు కోరుకుంటున్నాం, కానీ.. తారిక్ రెహమాన్ సన్నిహితుడు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:50 PM

తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం పొరుగు ఉన్న భారతదేశంతో ప్రజల మధ్య సంబంధాలను, వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటుందని బీఎన్పీ అధినేత ముఖ్య సన్నిహితుడు హుమయూన్ కబీర్ అన్నారు. రెహమాన్ టీమ్‌లో అంతర్జాతీయ సంబంధాలను చూసే హుమయూన్‌కు త్వరలోనే ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుంది. ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రజల మధ్య బలమైన సహకారం పెంపొందించడానికే మా ప్రాధాన్యత అని ఆయన ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో తాము సందర్శించాలనుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి అని తెలిపారు.


అయితే, ముందు దేశ ప్రాధాన్యతలని, తర్వాతే అంతర్జాతీయ సంబంధాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బంగ్లాదేశ్ అధికారులు భారత్‌‌కు, భారత్ అధికారులు బంగ్లాదేశ్‌‌కు ఈ ద్వైపాక్షిక పర్యటనలు సర్వసాధారణం.. కానీ, మేము అటువంటి సంబంధాలే కాదు... ప్రజల మధ్య విస్తృత సంబంధాలను కోరుకుంటున్నాం’’ అని అన్నారు.


షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. పాకిస్థాన్‌‌కు దగ్గరవుతోంది. దీనిపై ప్రశ్నకు కబీర్ స్పందిస్తూ.. ఆచితూచి సమాధానం ఇచ్చారు. ‘ఇది సాధారణమే అనుకుంటున్నా.. భారత్, పాకిస్థాన్‌ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో మాకు సాధారణ సంబంధాలు అవసరం.. ఈ అంశంలో మేము ఏకపక్షంగా ఉండబోం’ అని చెప్పారు. పరస్పర గౌరవం, జాతీయ ప్రయోజనాల ఆధారంగా సంబంధాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని కబీర్ పేర్కొన్నారు.


ఈ సందర్బంగా మాజీ ప్రదాని షేక్ హసీనా విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించారు. భారత్‌తో ఆమె సంబంధాలు ఏకపక్షంగా ఉండేవని, ప్రజలు దానిని హర్షించలేదని వ్యాఖ్యానించారు. తాము మాత్రం ఒకే దేశం కేంద్రీకృత విదేశాంగ విధానం లేదా విదేశంపై ఆధారపడే విదేశాంగ విధానం నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.


బంగ్లాదేశ్ ప్రజలు బీఎన్పీకి అఖండ విజయాన్ని అందించిన నిర్ణయాత్మక తీర్పుతో యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ అరాచక పాలన ముగిసింది. దీంతో, న్యూఢిల్లీ, ఢాకా మధ్య దౌత్యపరమైన పునరుద్ధరణకు తిరిగి తలుపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆచితూచి అడుగులు వేయనుంది. తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకోబోయే చర్యలు ఆధారంగా భారత్ స్పందన ఉంటుంది. అలాగే, మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలనే డిమాండ్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని బీఎన్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను అప్పగించడానికిి భారత్ ప్రస్తుతం సిద్ధంగా లేదు. దీనిపై యూనస్ ప్రభుత్వం కోరినా భారత్ స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa