వ్యవసాయ పంటలను ఆశించి తీవ్ర నష్టం కలిగించే కీటకాల్లో చెదపురుగులు ప్రధానమైనవి. వీటి ఉద్ధృతిని తగ్గించాలంటే రైతులు ముందుగా వేసవి కాలంలోనే జాగ్రత్తలు చేపట్టాలి. పొలాల్లో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా భూమి లోపల ఉండే చెదపురుగుల గూళ్లు బయటపడి, ఎండ తీవ్రతకు అవి నశిస్తాయి. అలాగే పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చెదపురుగులు ఆశ్రయం పొందే అవకాశాలు తగ్గుతాయి.
ఎరువుల వాడకంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా పచ్చి పేడను లేదా సరిగ్గా కుళ్లని పశువుల ఎరువును పొలంలో వేయకూడదు, ఎందుకంటే ఇది చెదపురుగులను త్వరగా ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ బాగా చివికిన పశువుల ఎరువును మాత్రమే వాడి, దానిని భూమిలో కలియదున్నాలి. ఇది నేల సారవంతం కావడమే కాకుండా, పురుగుల వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడుతుంది.
పంటల సాగులో వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. అలాగే, ప్రధాన పంటతో పాటు పసుపును అంతర పంటగా సాగు చేయడం వల్ల చెదపురుగుల ఉద్ధృతిని సమర్థవంతంగా తగ్గించవచ్చు. పొలంలో పాత పంట వ్యర్థాలను, ఎండు కట్టెలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, గూడులో ఉండే తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయడం ద్వారా వీటి సంతతిని నియంత్రించవచ్చు.
ఒకవేళ పంట ఇప్పటికే చెదపురుగుల బారిన పడినట్లయితే, రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్ల వద్ద నేల తడిచేలా మందును పిచికారీ చేయాలి. దీనికోసం లీటరు నీటికి 2 ఎం.ఎల్. క్లోరిపైరిఫాస్ 50% EC కలిపి తడపడం వల్ల పురుగులు నశిస్తాయి. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa