ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ లో హిందూ పోలీసును చంపిన విద్యార్థి నేత అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 04:48 PM

బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓ హిందూ పోలీస్ అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడు భారత భద్రతా దళాలకు చిక్కాడు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అతడు వస్తున్నాడన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. కళ్లకు కనిపించిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని వెంటనే బంగ్లాదేశ్‌కు బహిష్కరించారు.


ఎయిర్‌పోర్టులో హైడ్రామా..


అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని హబీగంజ్‌కు చెందిన అహ్మద్ రజా హసన్ మెహదీ అనే విద్యార్థి నాయకుడు భారత్ మీదుగా ఒక యూరోపియన్ దేశానికి పారిపోయేందుకు ప్లాన్ చేశాడు. గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశానికి వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న సమయంలో.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని గుర్తించారు. ముఖ్యంగా నిందితుడిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ హెచ్చరికలు, లుకౌట్ నోటీసుల ఆధారంగా అధికారులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.


ఆపై నిందితుడిని క్షుణ్ణంగా పరిశీలించిన మరీ విచారించారు. అతడు సంతోష్ చౌదరి హత్య కేసులో వాంటెడ్ నిందితుడని నిర్ధారణ కావడంతో.. భారత్ నుంచి అతడిని బంగ్లాదేశ్‌కు బహిష్కరించాలని నిర్ణయించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మెహదీని బంగ్లాదేశ్ సరిహద్దు అధికారులకు అప్పగించారు. భారత అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య భద్రతా సహకార బంధం మరింత బలపడింది.


అసలీ సంతోష్ చౌదరిని ఎలా చంపాడు?


గతేడాది ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో జరిగిన అల్లర్లలో సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అహ్మద్ రజా హసన్ మెహదీపై హత్యతో పాటు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నుంచి బంగ్లాదేశ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న మెహదీ.. తాజాగా భారత్ మీదుగా విదేశాలకు వెళ్లిపోవాలని పథకం వేశాడు. కానీ అధికారులకు చిక్కి బంగ్లాదేశ్‌లోనే ఊచలు లెక్కపెట్టేందుకు వెళ్లిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa