ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాల్లో ఈ ఆరు తప్పులు చేశారంటే నో-ఫ్లై లిస్టలోకే

national |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 04:47 PM

విమాన ప్రయాణంలో అతిగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) సిద్ధమైంది. విమానాల్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. అసభ్య ప్రవర్తన నిర్వచనాన్ని మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలకు అదనంగా మరో ఆరు కొత్త కేటగిరీలను ఈ జాబితాలో చేర్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విమానంలో క్రమశిక్షణ తప్పితే 30 రోజుల వరకు నిషేధం విధించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు లభించింది.


కొత్తగా చేర్చిన ఆ 6 కేటగిరీలు ఏంటి?


డీజీసీఏ తాజా ఆదేశాల ప్రకారం.. విమానంలో పొగత్రాగడం తీవ్రమైన నేరం. అలాగే దేశీయ విమానాల్లో మద్యం సేవించడం, అలాగే అంతర్జాతీయ విమానాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కూడా తప్పే. అత్యవసర ద్వారాలను అనవసరంగా తాకడం లేదా లైఫ్ జాకెట్లు వంటి జీవ రక్షణ పరికరాలను అనుమతి లేకుండా వాడటం కూడా అసభ్య ప్రవర్తన కిందకే వస్తుంది. విమానం లోపల నినాదాలు చేయడం, నిరసనలకు దిగడాన్ని కూడా ఇకపై నేరంగానే పరిగణించనున్నారు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి ప్రయాణికులకు, సిబ్బందికి అసౌకర్యం కలిగించినా వెంటనే చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా అరవడం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, ముందు సీట్లను తన్నడం లేదా ట్రే టేబుళ్లను విరగ్గొట్టడం వంటి వాటిని కూడా నేరంగానే చూడనున్నారు.


గతంలో అయితే విమానంలో ఏదైనా తప్పు జరిగి ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వతంత్ర కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకునేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం.. పైన పేర్కొన్న ఆరు నేరాలలో ఏ ఒక్కటి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినా.. ఎయిర్‌లైన్స్ సంస్థలు స్వతంత్ర కమిటీతో సంబంధం లేకుండా నేరుగా ఆ ప్రయాణికుడిపై 30 రోజుల పాటు ప్రయాణ నిషేధం విధించవచ్చు.


పైలట్లకు పవర్స్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!


విమానంలో ప్రయాణికుడి ప్రవర్తన నియంత్రణ దాటిపోతోందని భావిస్తే.. క్యాబిన్ క్రూ వెంటనే పైలట్-ఇన్-కమాండ్‌కు సమాచారం అందించాలి. పరిస్థితి తీవ్రతను బట్టి పైలట్ తన విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే అధికారం ఉంటుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సంస్థలు, గ్రౌండ్ స్టాఫ్ సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపడతారు. అయితే "ప్రయాణికుల్లో అతి కొద్దిమంది మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నప్పటికీ.. ఒక్కరి వల్ల కూడా విమాన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే భద్రత విషయంలో రాజీ పడేది లేదు" అని డీజీసీఏ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa