పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ను కూడా వణికిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిపై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం ఉందని, ఆ వ్యూహం అంతిమంగా పాకిస్థాన్ ఉనికినే దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. దీన్ని అదునుగా చేసుకుని అఫ్గాన్, ఇరాన్, భారత దేశాలు తమ దేశాన్ని సామంత దేశంగా మార్చడానికి కుట్ర చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు.
పాకిస్థానే లక్ష్యంగా జియోనిస్ట్ కుట్ర..!
ఖవాజా ఆసిఫ్ తన సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అమెరికా, ఇజ్రాయెల్ కావాలనే టెహ్రాన్‌పై యుద్ధాన్ని రుద్దాయని ఆయన పేర్కొన్నారు. "ఈ యుద్ధం కేవలం ఇరాన్ కోసమే కాదు. ఇజ్రాయెల్ తన ప్రభావాన్ని పాకిస్థాన్ సరిహద్దుల వరకు విస్తరించుకోవడానికి ఆడుతున్న నాటకం" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విధ్వంసం వెనుక జియోనిజం (యూదు భావజాలం) హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
భారత్, అఫ్గాన్‌ల ఉమ్మడి ఎజెండా?
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే.. అది పాకిస్థాన్‌కు పెను ప్రమాదమని ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ అండతో భారత్, అఫ్గానిస్థాన్‌లు ఏకమై పాకిస్థాన్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. "భారత్, అఫ్గాన్, ఇరాన్‌ల ఉమ్మడి ఎజెండా ఇప్పుడు పాకిస్థాన్‌పై శత్రుత్వమే. మమ్మల్ని శత్రువులతో చుట్టేసి, పాకిస్థాన్‌ను ఒక సామంత దేశంగా మార్చాలని చూస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.
25 కోట్ల మందికి పిలుపు..
పాకిస్థాన్ ఒక అణుశక్తి గల దేశమని, తమ సైన్యం ధైర్యసాహసాలను ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ, మతపరమైన విభేదాలను పక్కనపెట్టి.. తమ నిత్య శత్రువులు పన్నుతున్న ఈ కుట్రను పాకిస్థాన్‌లోని 25 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా జియోనిస్టులే శాసిస్తున్నారని.. ఇప్పుడు వారి చూపు పాక్ సరిహద్దులపై పడిందని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa