ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై చంద్రబాబు శాసనసభలో కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 06:59 AM

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కొందరి నిర్లక్ష్యం, దురాశ కారణంగానే ఈ పెను విషాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదానికి గురైన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు జారీ అయ్యాయని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి మందుగుండు సామగ్రిని నిల్వ చేసి, పెద్ద ఎత్తున బాణసంచా తయారు చేయడమే ప్రమాదానికి దారితీసిందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను విజయనగరం పర్యటనలో ఉన్నప్పటికీ, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించినట్లు తెలిపారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిరాశ్రయులైన బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆరుగురు క్షతగాత్రులు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.ఈ ఘటనలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని సీఎం వెల్లడించారు. పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్‌లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐజీ రామకృష్ణలతో ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేశామని, అతని ఆస్తులను వేలం వేసి ఆ డబ్బును బాధితులకు పంచుతామని స్పష్టం చేశారు.ఇంతటి తీవ్రమైన ప్రజా సమస్యపై దృష్టి సారించకుండా, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తిరుపతి లడ్డూ ప్రసాదం వంటి విషయాలపై రాజకీయం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ప్రజా రక్షణ బాధ్యత నుంచి తాము తప్పుకోబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శాసనసభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa