మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికాతో బహిరంగ చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్, అంతర్గతంగా మాత్రం రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా సంస్థ 'సీఐఏ' (CIA) అధికారులతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు సుముఖత వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతోనే ఈ రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతం కంటే భిన్నంగా ఇప్పుడు చర్చల కోసం ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసినట్లు ఆ నివేదిక సారాంశం.
ఈ రెండు శత్రు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు మరో దేశానికి చెందిన స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇరు దేశాల ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ మూడో దేశం ఇరు పక్షాల మధ్య సంప్రదింపుల వంతెనగా పనిచేస్తోంది. నేరుగా చర్చలకు కూర్చుంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్న భావనతో, స్పై ఏజెన్సీల ద్వారా సందేశాలను పంపుకోవడం సురక్షితమని ఇరు దేశాలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ రహస్య చర్చల విషయంలో ఇరు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా తమ దేశాల ‘హైకమాండ్’ లేదా అత్యున్నత స్థాయి నాయకత్వం ఈ ప్రతిపాదనలపై చివరగా ఎలా స్పందిస్తుందోనన్న సందిగ్ధంలో అధికారులు ఉన్నారు. ఒకవేళ చర్చల విషయం లీక్ అయితే వచ్చే పరిణామాలు, అలాగే తమ దేశాల అంతర్గత రాజకీయాలపై పడే ప్రభావం గురించి ఏజెన్సీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా, తెర వెనుక ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా, ఇరాన్ తన వైఖరిని మార్చుకుని చర్చలకు సిద్ధమవ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్గత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అమెరికాతో ఒక అవగాహనకు రావడం ఇరాన్‌కు కూడా అవసరంగా మారింది. ఈ నిఘా వర్గాల మంతనాలు గనుక సఫలమైతే, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa