సుదీర్ఘ కాలం పాటు బిహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నితీశ్ కుమార్, తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శాసనసభ, లోక్‌సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన తనకు, రాజ్యసభకు కూడా వెళ్లాలనే బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయమని భావిస్తూ, రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని పెద్దల సభకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గత రెండు దశాబ్దాలుగా తన వెన్నంటి ఉండి నడిపించిన పార్టీ క్యాడర్‌కు, తనను ఆదరించిన బిహార్ ప్రజలకు నితీశ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు లేనిదే తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని, వారి ప్రేమాభిమానాలే తనను ఇన్నాళ్లు నడిపించాయని ఆయన భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, వారి సేవలను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి పదవికి వీడ్కోలు పలుకుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని నితీశ్ భరోసా ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, బిహార్ అభివృద్ధి బాటలో పయనించేలా తన సలహాలు, సూచనలు అందిస్తానని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండటంతో, బిహార్ రాజకీయాల్లో కొత్త నాయకత్వంపై చర్చ మొదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa