ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 06:16 PM

రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అకోలా తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు.. మొలకలచెరువులో అదనపు స్టాపేజ్ కల్పించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మార్చి ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలు (07605) తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది.


పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. నిమిషం పాటు మొలకలచెరువు రైల్వేస్టేషన్‌లో ఆగుతుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అనంతరం కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల మీదుగా ప్రయాణించి.. రాత్రి ఒంటి గంట 40 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్ మీదుగా ప్రయాణించి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.


మరోవైపు అకోలా - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు (07606) ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల 34 నిమిషాలకు మొలకలచెరువు రైల్వేస్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మార్చి ఆరో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. తదుపరి నిర్ణయాన్ని ప్రకటించేవరకూ తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో స్టాపింగ్ ఉంటుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది. వేసవి సెలవులు రానుండటంతో తిరుమలకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరిగేందుకు ఆస్కారం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa