ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఐదు ముఖ్యమైన శాఖల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖతో పాటుగా గ్రామీణాభివృద్ధి. గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖల పరిధిలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ శాఖల పరిధిలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో తన శాఖల పరిధిలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో బుక్ లెట్ ముద్రించి.. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా తొలి బుక్‌లెట్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు. స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అయ్యన్నపాత్రుడికి ఈ బుక్ లెట్అందించారు. అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0 కార్యక్రమాలు, సాస్కీ వంటి పథకాల ద్వారా గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనుల వివరాలను బుక్ లెట్‌లో ముద్రించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు, 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎంతమేరకు అందించారనే వివరాలను అందులో పొందుపరిచారు.
అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకూ రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పవన్ కళ్యాణ్ స్పీకర్‌కు వివరించారు. పల్లెపండగ 1.0 కార్యక్రమం కింద రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 58.85 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్టు స్పీకర్‌కు పవన్ కళ్యాణ్ వివరించారు.
అలాగే అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 173.53 కోట్లు కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఈ బుక్ లెట్లు అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఆ రకంగా తన మంత్రిత్వశాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa