ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకం నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 06:22 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని ఇప్పటికే ఎవరెవరు నిషేధించారు.. ఎలాంటి విధానం అమలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఆస్ట్రేలియా. అక్కడ 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధించారు. ఫేస్ బుక్, ఎక్స్, టిక్ టాక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యబ్, స్నాప్ చాట్, థ్రెడ్ వంటివి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాడకాన్ని 16 ఏళ్లలోపు వారికి నిషేధించారు.


దీంతో ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకోవటానికి 16 ఏళ్లలోపువారికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పటికే 16 ఏళ్లలోపు వారి పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు డీయాక్టివేట్ చేస్తారు. యువతపై సోషల్ మీడియా దుష్ర్పభావాన్ని తగ్గించడంతో పాటుగా.. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపటం ద్వారా వారి ఆరోగ్యం దెబ్బతింటోందనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సోషల్ మీడియా నిషేధాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే చిన్నారులు, వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోరు. బదులుగా సోషల్ మీడియా సంస్థలు జరిమానాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు తమ ప్లా్ట్ ఫామ్‌ల నుంచి పిల్లలను దూరంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వయసు నిర్ధారణ కోసం మల్టిపుల్ ఏజ్ ఎసూరెన్స్ టెక్నాలజీలు వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఐడీలు, ఫేస్, వాయిస్ రికగ్నిషన్ వంటి పద్ధతులు ఉపయోగించి వయసు నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల స్వీయ ధృవీకరణ, తల్లిదండ్రులు తమ పిల్లలకు హామీ ఇవ్వడం వంటి పద్ధతులపై సోషల్ మీడియా సంస్థలు ఆధారపడకూడదు.


మరోవైపు మెటా సంస్థ గతేడాది డిసెంబర్ నుంచి టీనేజర్ల ఖాతాలను మూసివేస్తోంది. ఒకవేళ ఎవరైనా 16 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్నవారి ఖాతాలను మూసివేస్తే.. ప్రభుత్వ ఐడీలను ఉపయోగించి వారు తమ వయస్సు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంలో వినియోగదారుల వయసు ధ్రువీకరణ కోసం వారి డేటాను సేకరించటం, స్టోర్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విషయంలో ఎలాంటి పద్ధతి అనుసరిస్తుందనేదీ ఆసక్తికరంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa