ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే విధివిధానాలను ఖరారు చేస్తామని.. దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచనని.. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ప్రతిపాదించారని.. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అసెంబ్లీలో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై కీలక ప్రకటన చేశారు. కర్ణాటకలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తామని తెలిపారు. పిల్లలపై మొబైల్స్, సోషల్ మీడియా దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధ రామయ్య అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
పిల్లల్లో మొబైల్ వాడకం వల్ల తలెత్తుతున్న సమస్యలు, ప్రతికూల భావాలను నివారించడానికే ప్రభుత్వాలు వరుసగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత భారత్‌లో కూడా కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలుత కర్ణాటక 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించింది.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. గోవా ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa