ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026 విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి ఆకట్టుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టం లేకుండా 92 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో సంజూ శాంసన్ 33 పరుగులతో, అభిషేక్ శర్మ 51 పరుగులతో నిలిచారు.సెమీఫైనల్లో ఆడిన అదే జట్టును భారత్ ఫైనల్లో కూడా కొనసాగించింది. ఇటీవల మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఫామ్‌లో లేకపోయినా జట్టు యాజమాన్యం వారిపై నమ్మకం ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగారు. న్యూజీలాండ్ తరఫున మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), టిమ్ సెఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జాకబ్ డఫీ, జిమ్మీ నీషమ్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్ ఆడుతున్నారు.గత ఎడిషన్‌లో ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ ఈసారి కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి ఛాంపియన్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి గెలిచిన జట్టుగా భారత్ కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో కీలక మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై సాధించిన విజయం జట్టుకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.మరోవైపు న్యూజీలాండ్ జట్టు కూడా స్థిరమైన ఆటతీరుతో నిశ్శబ్దంగా ఫైనల్‌కు చేరుకుంది. ఐసీసీ టోర్నీల్లో తరచూ సెమీఫైనల్ లేదా ఫైనల్ వరకు వచ్చి కప్పును కోల్పోయిన కివీస్, ఈసారి మాత్రం టైటిల్ గెలవాలని సంకల్పంతో ఉంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై సాధించిన విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక న్యూజీలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa